Top
Telugu Gateway

సెక్రటేరియట్ కూల్చివేతలు చూపిస్తాం

సెక్రటేరియట్ కూల్చివేతలు చూపిస్తాం
X

హైకోర్టులో కేసు తుది విచారణ జరగాల్సిన సోమవారం నాడు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం మీడియాకు సచివాలయం కూల్చివేతలు చూపిస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మీడియాను తీసుకెళతామని ఆయన పేర్కొన్నారు. ‘సచివాలయంలో ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు (వ్యర్థాలు) మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే 2వేల లారీల ట్రిప్పులు ఎత్తివేయడం జరిగింది. మిగతా పనులు జరుగుతున్నాయి. ఎత్తైన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు.

కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ విజ్ఞప్తిని పరిశీలించి, కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు’ వేముల ప్రశాంత రెడ్డి ప్రకటించారు. అయితే కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

Next Story
Share it