Telugu Gateway
Politics

2023లో కెసీఆర్ అడ్రస్ చంచల్ గూడ జైలే

2023లో కెసీఆర్ అడ్రస్ చంచల్ గూడ జైలే
X

ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యల

ఎంపీ కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణుల దాడి

‘నాకు కొత్తగా ఓ విషయం తెలిసింది. కెసీఆర్, కెటీఆర్, కవిత, సంతోష్ రావుల కోసం అక్కడ నాలుగు సూట్ రూములు. ఇవి కాకుండా ప్రత్యేకంగా ఓ 50 రూములతో చంచల్ గూడ జైలులో ప్రత్యేక సెల్ నిర్మించబోతున్నారు. దీనికి బడ్జెట్ శాంక్షన్ కూడా చేశారు. 2023 తర్వాత మనం వీళ్ళెవరినైనా కలవాలంటే చంచల్ గూడ జైలర్ ను పట్టుకోవాల్సిందే’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూటికి నూరు శాతం వీళ్ల అడ్రస్ ఫాంహౌస్ కాదు..ప్రగతి భవన్ కాదు. చంచల్ గూడ జైలే అన్నారు. వరంగల్ లో ఆయన ఆదివారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్ లపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులను తెలంగాణ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ను వ్యక్తిగతంగా దూషించటంతోపాటు మంత్రి కెటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ఎమ్మెల్యేలను బిర్లా, రంగాలు అంటూ సంభోదించారు.

దేశంలోనే తెలంగాణలో కరోనా పాజిటివిటి రేటు చాలా ఎక్కువగా ఉందని..అయినా సరే ముఖ్యమంత్రి కెసీఆర్ పదిహేను రోజులు ఫాంహౌస్ లో పడుకుని వచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ అతి పెద్ద హిందూ వ్యతిరేకి అని..ఆయన తర్వాతే అసదుద్దీన్ ఓవైసీ ఉంటారని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ లో ప్రస్తుతం పరిస్థితులు సాదారణ స్థితికి చేరుకున్నాయని..మరో ఏడాది తర్వాత మంత్రి కెటీఆర్ ఫ్రెండ్స్ అంతా అక్కడకు వెళ్లి మామూలుగా షూటింగ్ లు చేసుకోవచ్చని అన్నారు. అరవింద్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం నింపాయి. దీంతో వాళ్లంతా ఎంపీ వాహనంపై దాడికి దిగారు. విలేకరుల సమావేశం ముగించుకుని వెళుతున్న సమయంలో అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతోపాటు..కాన్వాడ్ పై దాడి చేశారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట..ఘర్షణ జరిగింది. కొంత మంది బిజెపి కార్యకర్తలు బిజెపి ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

Next Story
Share it