Telugu Gateway
Andhra Pradesh

తిరుమలలో ‘కంటైన్ మెంట్’ జోన్ వివాదం

తిరుమలలో ‘కంటైన్ మెంట్’ జోన్ వివాదం
X

చిత్తూరు జిల్లా యంత్రాంగం చేసిన చిన్నపాటు పెద్ద దుమారానికి కారణం అయింది. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం పలు ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటిస్తోంది. గురువారం నాడు ప్రకటించిన కంటైన్ మెంట్ జోన్లలో తిరుమల పేరు కూడా ఉండటం పెద్ద దుమారం రేపింది. ఓ వైపు తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వస్తున్న తరుణంలో కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించటంతో టీటీడీ అధికారులు కూడా అవాక్కు అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా ఎలా కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే కానీ జనాలు నివాసం ఉండే ప్రాంతం కాదని, కరోనా పాజిటివ్ వచ్చిన కేసులన్నీ తిరుపతిలో నివాసం ఉండేవారివేనని తెలిపారు.

అంతే కాదు కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించాలంటే రెండు రోజుల ముందే తమకు సమాచారం ఇవ్వాలని టీటీడీ అధికారులు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా కూడా వెంటనే స్పందించారు. సిబ్బంది పొరపాటు వల్లే తిరుమల పేరు కంటైన్ మెంట్ జాబితాలో వచ్చిందని..ప్రస్తుతం తిరుమలలో భక్తులకు దర్శనాలు సాఫీగా సాగుతున్నాయని తెలిపారు. అయితే కేసుల సంఖ్య మరింత పెరిగితే టీటీడీ అధికారులతో చర్చించి తిరుమల ఆలయాన్ని మూసివేయటానికి కూడా వెనకాడబోమని కలెక్టర్ ప్రకటించారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. ఓ బెటాలియన్ లోని పోలీసులు 39 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ వెల్లడించారు.

Next Story
Share it