Telugu Gateway
Andhra Pradesh

జగన్ సంచలన నిర్ణయం

జగన్ సంచలన నిర్ణయం
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఆస్పత్రి అయినా కోవిడ్ 19 రోగులకు చికిత్స చేయటానికి నిరాకరిస్తే ఆ ఆస్పత్రి అనుమతి రద్దు చేయటానికి కూడా వెనకాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కోవిడ్‌ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్‌ సెంటర్‌ నంబర్‌తో కూడిన హోర్డింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు.

ఫీడ్‌బ్యాక్‌ కోసం ప్రతి రోజూ ప్రతి సెంటర్, ఆస్పత్రికీ కాల్స్‌ చేయాలి. ప్రతి క్వారంటైన్‌ కేంద్రం, కోవిడ్‌ కేర్‌ సెంటర్,కోవిడ్‌ ఆస్పత్రులకు కచ్చితంగా ర్యాండమ్‌గా కనీసం మూడు ఫోన్‌ కాల్స్‌ చేయాలి.క్రమం తప్పకుండా ఆ ఆసుపత్రులను, క్వారంటైన్‌ సెంటర్లను పర్యవేక్షించాలని జగన్ ఆదేశించారు. క్వారంటైన్ సెంటర్లలో ఆహారంతోపాటు పరిశుభ్రత మీద మరింత ఫోకస్ పెట్టాలని కోరారు. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినా సరే.. ఎక్స్‌ రేలో విభిన్నంగా కనిపిస్తే పాజిటివ్‌గా పరిగణిస్తూ వైద్యం అందిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా తేలిన వారు ఆలస్యంగా ఆస్పత్రికి వస్తుండటంతో మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే వాటిని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు.

Next Story
Share it