Telugu Gateway
Politics

అసెంబ్లీ సమావేశాల కోసం ముఖ్యమంత్రి పోరాటమా?

అసెంబ్లీ సమావేశాల కోసం ముఖ్యమంత్రి పోరాటమా?
X

కాంగ్రెస్ పార్టీ గతంలో వంద తప్పులు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు బిజెపి చేస్తుంది ఏంటి?. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి పోరాటం చేయాల్సి రావటమా?. బహుశా ఇలా జరగటం దేశంలో ఇదే మొదటిసారి కావొచ్చు. నిజంగా రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా శాసనసభలో సీఎం అశోక్ గెహ్లాట్ కు మెజారిటీ లేదు అనుకుంటే బలపరీక్షకు ఆదేశించవచ్చు. కానీ స్వయంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ లో సీఎం స్వయంగా బలపరీక్షకు రెడీ ..సమావేశాలు ఏర్పాటు చేయండి అంటే గవర్నర్ నో అంటున్నారు. లేదు కోవిడ్ 19 తోపాటు ఇతర అంశాలతో పాటు చర్చిస్తాం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయమంటే దానికి నో చెబుతున్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభానికి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయాలనే ఏకైక సాంకేతిక అంశాన్ని అడ్డం పెట్టుకుని గవర్నర్ పేరుతో ఆడుతున్న డ్రామా ఇది. అసలు శాసనసభలో ఏమి చర్చించాలో..ఏమి చర్చించకూడదో నిర్ణయించటానికి గవర్నర్ ఎవరు?. సాక్ష్యాత్తూ రాజస్థాన్ మంత్రివర్గం పలుమార్లు సిఫారసు చేసినా కూడా గవర్నర్ అన్నింటిని తిప్పి పంపుతున్నారంటే ఏమి జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ లో అనిశ్చితి చూసి ఎవరైనా ఎమ్మెల్యేలు బిజెపి వైపు వస్తారని చూస్తుంటే ఇప్పటివరకూ అదీ జరగటం లేదు.

ఓ వైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బంధువులు..సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు..నోటీసులు జారీ చేస్తున్నా ఆశించిన ఫలితం ఏమీ కన్పించటంలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా ఇదే పరిస్థితి కొన్ని రోజులు సాగదీస్తే ప్రభుత్వ మనుగడ కష్టమని భావించి ఎమ్మెల్యేలు ఫిరాయించాలి. వాళ్లంతా బిజెపికి మద్దతు పలకాలి. అప్పుడు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు..బలపరీక్షకు గవర్నర్ ఆమోదం తెలుపుతారా?. రాజస్థాన్ లో పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా అలాగే కన్పిస్తోంది. గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించటం..ప్రభుత్వాలను కూలదోయటం వంటి పనులను కాంగ్రెస్ చాలానే చేసింది. కానీ బిజెపి మాత్రం కాంగ్రెస్ ను మించిపోయిన తరహాలో కొత్త కొత్త ఫిరాయింపులు, ప్రభుత్వాలను కూల్చే స్కీమ్ లను అమలు చేస్తూ కాంగ్రెస్ వాళ్లు కూడా అవాక్కు అయ్యేలా చేస్తోంది. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆ పార్టీలో తెచ్చిన చీలికతో రాజస్థాన్ లో ఏర్పడిన ఈ అనిశ్చితికి ఎప్పుడు ముగింపు పడుతుందో వేచిచూడాల్సిందే. కాకపోతే బిజెపి, గవర్నర్ ల వ్యవహారంతో ఆ పార్టీ కూడా కాంగ్రెస్ కు ఏ మాత్రం తీసిపోదనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నట్లు అయింది.

Next Story
Share it