Top
Telugu Gateway

గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం

గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం
X

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ఇది చారిత్రక తప్పదమని, రాజ్యాంగ విరుద్ధం అని వ్యాఖ్యానించారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గత 14 నెలల వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప మరేమీ జరగలేదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడా లేవని.. ఈ బిల్లులను తెచ్చిన సీఎం జగన్ విభజన చట్టానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు శాసనసభలో ఆమోదం తెలిపిన జగన్ ఇప్పుడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. మాట ఇచ్చి మడప తిప్పటం ద్వారా జగన్ రాష్ట్రానికి ద్రోహం చేశారన్నారు.

ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ, పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు అన్నారు. కానీ ప్రభుత్వం ప్రజలను మూడు రాజధానుల పేరుతో గందరగోళంలోకి నెడుతోందని విమర్శించారు. అమరావతి రాజధాని ప్రజల కల అని వ్యాఖ్యానించారు. ప్రజలు కరోనాతో బాధపడుతుంటే.. మళ్లీ రాష్ట్రంలో రాజధాని చిచ్చు పెట్టారని విమర్శించారు. అమరావతి రైతుల విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని, రాష్ట్రంలో అనైతిక పాలనపై గవర్నర్‌ బిశ్వభూషన్‌కు ఫిర్యాదుచేస్తే పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇవాళ చీకటి రోజన్నారు. గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అమరావతి ఐకాస పిలుపు మేరకు ఉద్యమంలో పాల్గొంటామని పేర్కొన్నారు.

Next Story
Share it