కేంద్రమే అమరావతిని కాపాడాలి

రాజధాని అమరావతి కొంత మంది వ్యక్తులో..పార్టీలదో కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మధ్యలో..ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందనే ఈ ఫ్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 200 రోజులకు చేరిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడారు. అమరావతి టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన కొంత మంది నేతలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉందని..అల్లూరి సీతారామరాజును స్పూర్తిగా తీసుకుని పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మించాలనుకోవటం టీడీపీ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. అమరావతి కోసం కొంత మంది రైతులు అమరులయ్యారని, వారి త్యాగం వృథా కారాదన్నారు.
అమరావతిని ఎవరూ ఏమీ చేయలేరని, దానికి ఓ చరిత్ర ఉందన్నారు. ప్రాచీన నాగరికతకు చిహ్నమని, శాతవాహనుల రాజధాని అని చెప్పారు. అమరావతి అజరామరమని పేర్కొన్నారు. అమరావతిలో హిందూ మహాసభ రామాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చిందని, అయోధ్య తరహాలో రామాలయం అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. అమరావతిపై ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని తెలిపారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు 139 సంస్థలు ముందుకు వచ్చాయని..ఇది కొనసాగి ఉంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మహిళలను కూడా చివరకు బూట్ కాళ్లతో తన్నారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి ఉద్యమంలో మానవ హక్కులను ఉల్లంఘించారని విమర్శించారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని కడతామని ప్రకటించారని..అమరావతికి శంకుస్థాపన కూడా చేసింది ఆయనే కాబ్టటి..దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మోడీపై ఉందన్నారు. సేవ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.