Telugu Gateway
Cinema

రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు
X

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు. అమృత, ప్రణయ్ ల ప్రేమ కథతో సినిమా తెరకెక్కిస్తున్న వర్మ ‘మర్డర్’ టైటిల్ తో ఫస్ట్ లుక్ విడుదలతోనే సంచలనం సృష్టించారు. ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ సినిమాపై ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీంతో రాంగోపాల్‌ వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులను ఆదేశించింది.

ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ నిర్మాత నట్టి కరుణలపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. బాలస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ సదా నాగరాజు రాంగోపాల్ వర్మతో పాటు, మర్డర్ సినిమా నిర్మాత నట్టి కరుణ మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అమృత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

Next Story
Share it