Telugu Gateway
Politics

రాజస్థాన్ లో ఆపరేషన్ కమలం..ఒక్కో ఎమ్మెల్యేకు 15 కోట్లు

రాజస్థాన్ లో  ఆపరేషన్ కమలం..ఒక్కో ఎమ్మెల్యేకు 15 కోట్లు
X

ఫస్ట్ కర్ణాటక. తర్వాత మధ్యప్రదేశ్. ఇప్పుడు రాజస్థాన్. బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ మొదలైందా?. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తరహాలోనే రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రెడీ అయిందా?. అంటే ఔననే చెబుతున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. కరోనా సంక్షోభ సమయంలో కూడా ఈ సిగ్గుమాలిన రాజకీయాలు ఏంటి అంటూ ఆయన మండిపడ్డారు. ప్రజలే త్వరలో బిజెపికి తగిన బుద్ధి చెబుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వారిలో చాలా మందిని ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయలు ఇఛ్చేందుకు బిజెపి సిద్ధం అయిందని ఆయన ఆరోపించారు. ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ఆరోపణ చేసినా బిజెపి నుంచి ఎలాంటి స్పందనా లేదు. వీలైతే డబ్బులిచ్చి పార్టీ మారేలా చేయటం..లేదంటే రాజీనామాలు చేయించి ఆ తర్వాత మళ్ళీ బిజెపి టిక్కెట్ కేటాయించి..ఎన్నికల్లో గెలిపించుకోవటం.

కర్ణాటక, మధ్యప్రదేశ్ ల్లో ఇదే మోడల్ ను ఫాలో అయిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న పార్టీకి అన్ని వనరులు ఉంటాయి కాబట్టి రాజీనామా చేయటానికి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. దీనికి తోడు ఇలా చేసే వారికి భారీ ప్యాకేజీలు కూడా ముడుతున్నాయి. అంతే కాదు పలువురు ఇలా చేసి ఏకంగా కర్ణాటకలో మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్ లోనూ జ్యోతిరాధిత్య సింథియా వర్గం మంచి వాటానే దక్కించుకుంది మంత్రివర్గంలో. అశోగ్ గెహ్లాట్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కరోనా కట్టడి పనిలో ఉంటే బిజెపి ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉందని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి బిజెపి అసలు రంగు బయటపడుతోందని విమర్శించారు.

Next Story
Share it