Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో కొత్త కొత్తగా...108, 104 సేవలు

ఏపీలో కొత్త కొత్తగా...108, 104 సేవలు
X

201 కోట్లతో 1088 వాహనాల కొనుగోలు

కొత్త వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ సర్కారు 201 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 108,104 వాహనాలు రోడ్డెక్కాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో బుధవారం నాడు వీటిని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ వాహనాలు అన్నీ ముందుకు కదిలాయి. ఏపీ సర్కారు మొత్తం 1088 వాహనాలను కొనుగోలు చేసింది. ఇందులో కొన్ని 108, మరికొన్ని 104 వాహనాలు ఉన్నాయి. గతంలో ఉన్న వాహనాల కంటే మెరుగైన సౌకర్యాలతో ఆపత్కాలంలో ఉన్న రోగులకు సేవలు అందించేందుకు వీలుగా సర్కారు వీటిని అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు ప్రస్తుతం ఈ వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. తర్వాత వీటిని రెగ్యులర్ వైద్య అవసరాలకు ఉపయోగిస్తారు. అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లను కూడా వినియోగించనున్నారు.

కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ డ్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)గా తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నాటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు. బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ ల్లో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ ల్లో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. నియో నాటల్‌ అంబులెన్స్‌ లలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను అమర్చారు. గతంలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్‌ ఉండేది.

ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్‌ అందుబాటులో ఉండనుంది. గతంలో సంవత్సరానికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు. ప్రతి మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు, ఇక నుంచి మారుమూల కుగ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేస్తారు.

Next Story
Share it