Telugu Gateway
Andhra Pradesh

క్లైమాక్స్ కు ఏపీ ‘క్యాపిటల్ రాజకీయం’

క్లైమాక్స్ కు ఏపీ  ‘క్యాపిటల్ రాజకీయం’
X

ఏపీ రాజధాని రాజకీయం క్లైమాక్స్ కు చేరింది. బంతి గవర్నర్ కోర్టులోకి వెళ్లింది. అందుకే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కొత్త మెలికలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ మెలికల ప్రయత్నాలు ఫలిస్తాయా?. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్ డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతకం చేసి పంపేస్తారా?. లేక న్యాయ నిపుణుల సలహా తీసుకుంటారా?. త్వరలోనే తేలిపోనుంది. బిల్లులు గవర్నర్ కు చేరతాయని తెలిసిన వెంటనే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రంగంలోకి దిగారు. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులకు ఛాన్స్ లేదని..విభజన చట్టంలో ఉన్న కమిటీ సిఫారసుల ప్రకారమే అమరావతిని ఎంపిక చేసినట్లు తెలుపుతూ గవర్నర్ కు లేఖ రాశారు. అంతే కాదు మీడియా ముందుకు వచ్చి ఇదే విషయాలను వెల్లడించారు. దీంతోపాటు సాంకేతిక అంశాలను లేవనెత్తుతున్నారు. శాసనమండలి సీఆర్ డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులను అటు ఆమోదించటంకానీ ..ఇటు తిరస్కరించటం ఏమీ చేయలేదని..అందుకు సర్కారు పంపిన బిల్లులు చెల్లుబాటు కావన్నారు.

మండలి తిరస్కరించినా ఓకే కానీ..అదేమీ చేయనందున గవర్నర్ నిర్ణయం తీసుకునే ముందు న్యాయసలహా తీసుకోవాలని సూచించారు. ఈ రెండు బిల్లులు కూడా సెలక్ట్ కమిటీ ముందు ఉన్నాయని .. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా కోర్టు ముందు అంగీకరించినందున గవర్నర్ అన్ని అంశాలను పరిశీలించాలని కోరారు. అసలు ఎక్కడా కూడా మూడు రాజధానులు అన్న అంశమే లేదని..ఓ వైపు నిధులు లేని సమయంలో మూడు రాజధానులు ఎందుకు అని యనమల ప్రశ్నించారు. ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నాలపై అధికార పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఎంత సేపూ సొంత ప్రయోజనాలు...రాజకీయ ప్రయోజనాలు తప్ప టీడీపీకి మరేమీ పట్టవని మండిపడ్డారు. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు.

ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందటం మీకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ శాసనసభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని కోరితే అందుకు ససేమిరా అన్న యనమల రామకృష్ణుడికి విలువల గురించి, నియమాల గురించి మాట్లాడే అర్హత ఉందా అని కన్నబాబు ప్రశ్నించారు. యనమల రామకృష్ణుడు తనకు తప్ప ఎవరికీ నియమ, నిబంధనలు తెలియవన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో రెండవ సారి బిల్లు పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమేటిక్ గా ఇది ఆమోదం పొందుతుందనే విషయం యనమలకు తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘనల్లో యనమల నిపుణుడు అని కన్నబాబు మండిపడ్డారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కనుక ఈ రెండు బిల్లులను ఆమోదిస్తే ఇక అమరావతి కథ అధికారికంగా ముగిసిపోయినట్లు అవుతుంది.

Next Story
Share it