Telugu Gateway
Andhra Pradesh

జగన్ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు

జగన్ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు
X

ఇద్దరు బయటకు. ఇద్దరు లోపలికి. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుచేసుకున్న తాజా మార్పులు. మంత్రులుగా ఉండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామాలతో ఖాళీ అయిన మంత్రివర్గ బెర్తులను బుధవారం నాడు భర్తీ చేశారు. కొత్తగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు లు నూతన మంత్రులుగా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వీరిద్దరితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులు ఇద్దరే కావటంతో అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమం ముగిసిపోయింది. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు హాజరు అయ్యారు. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలో నేతలు హాజరు అయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజు 2019లో తొలిసారిగా పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి అప్పలరాజుకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి తూర్పు గోదావరికి చెందిన చెల్లుబోయిన వేణుకు పదవి దక్కింది.

Next Story
Share it