Telugu Gateway
Telangana

విత్తనాల కోసం 25 కోట్లతో ఆల్ట్రా మోడ్రన్ కోల్డ్ స్టోరేజ్

విత్తనాల కోసం 25 కోట్లతో ఆల్ట్రా మోడ్రన్ కోల్డ్ స్టోరేజ్
X

రాష్ట్రంలో రైతు బంధు అందాల్సిన ఒక్క రైతు కూడా మిగలకుండా గుర్తించి వారికి సాయం చేయాలని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ జాబితాను గుర్తించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమని, ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని సిఎం అన్నారు. సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు 25 కోట్ల రూపాయల వ్యయంతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినా, వెంటనే వారిని గుర్తించి సాయం అందించాలి. ఏ ఒక్కరూ మిగలకుండా చిట్ట చివరి రైతు వరకు రైతుబంధు సాయం అందించాలి. కాస్తులో ఉన్నప్పటికీ కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్ ఎంక్వైరీ) నిర్వహించాలి. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలి.

Next Story
Share it