Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ ఎంపీపై వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేలు ఫైర్

వైసీపీ ఎంపీపై  వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేలు ఫైర్
X

రఘురామకృష్ణంరాజు. వైసీపీ ఎంపీ. గత కొన్ని రోజులుగా ఆయన తన వ్యాఖ్యలతో పార్టీలో కాక రేపుతున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సదరు ఎంపీపై మండిపడ్డారు. మంత్రి పేర్ని నాని ఎంపీ వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశ్నించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. పార్టీని కాకుండా తనను చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చెప్పుకుంటున్న రఘురామకృష్ణంరాజుకు, నరసాపురం పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు కంటే ఎందుకు తక్కువగా ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తమది టీడీపీ, బీజేపీ లాంటి పార్టీ కాదని, రఘురామకృష్ణంరాజు పప్పులు ఇక్కడ ఉడకవని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మరో మంత్రి రంగనాఘరాజు మాట్లాడుతూ సీఎం జగన్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారన్నారు. ఎంపీ రఘురామకృషంరాజు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేశారు కాబట్టే రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలిచారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. రఘురామ కృష్ణంరాజు ఏ మాత్రం పద్దతిగా మాట్లాడడం లేదని విమర్శించారు. నరసాపురంలో ఆయనకు బ్యానర్‌ కట్టే క్యాడర్‌ కూడా లేదని విమర్శించారు. మరో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా కూడా ఎంపీపై విమర్శలు చేశారు. రఘురామకృష్ణంరాజుకు అంతగా సొంత బలంగా ఉంటే రాజీనామా చేసి పోటీచేయాలన్నారు.

Next Story
Share it