Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు రఘురామకృష్ణంరాజు లేఖ

జగన్ కు రఘురామకృష్ణంరాజు లేఖ
X

అధికార వైసీపీలో గత కొన్ని రోజులుగా దుమారం రేపుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సోమవారం నాడు వైసీపీ అధినేత, సీఎం జగన్ కు సుదీర్గ లేఖ రాశారు. అందులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి నుంచి నోటీసు అందిందని, ఆయన లేఖకు స్పందిస్తూ సమాధానం ఇస్తున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. సీ ఓటర్‌ సర్వేలో నాల్గవ స్థానం వచ్చినందుకు జగన్‌కు అభినందనలు తెలిపారు. త్వరలో మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. రిజిస్టర్ అయిన పార్టీ పేరుతో కాకుండా మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు అందిందని తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని.. పలు సందర్భాల్లో ఈసీ మన పార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును ఏ సందర్భంలోనూ వాడుకునే అవకాశం లేదని ఈసీ తేల్చి చెప్పిందని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. తాను కోట్లాది మంది తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాల గురించి మాట్లాడితే కొంత మంది మీ పక్కన ఉన్న వారు తనను క్రైస్త్రవ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని తెలిపారు.

ఇసుక అక్రమాల గురించి మాత్రమే తాను బహిరంగంగా మాట్లాడానని.. ఈ విషయం మీ దృష్టికి తెచ్చుందుకు తప్ప మరో ఉద్దశం లేదన్నారు. స్వయంగా ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి రెండు లక్షల టన్నుల ఇసుక పక్కదారి పట్టిందని తెలిపారన్నారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తన దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆదేశించటం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. కొంత మంది ఏర్పాటు చేసిన నిరసన దారులు తీవ్రమైన పదజాలంతో దిష్టిబొమ్మలకు పట్టిన గతే తనకు పడుతుందని హెచ్చరించారని తెలిపారు. ఈ అంశంపై ఫిర్యాదు చేయటానికి డీజీపీ కోసం ప్రయత్నించగా తన ప్రయత్నాలు విఫలం అయ్యాయాని, అందుకే తాను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఓ నమ్మకమైన పార్టీ సైనికుడిగా తాను అధినేతపై కానీ..పార్టీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనకు కలిసే అవకాశం ఇవ్వాలని కోరుతూ లేఖను ముగించారు.

Next Story
Share it