Telugu Gateway
Andhra Pradesh

రోజాకు రూల్స్ వర్తించవా!

రోజాకు రూల్స్ వర్తించవా!
X

ఆలయం ముందే ‘తిని కూర్చుని..ఒళ్ళు కొవ్వొక్కి’ వంటి వ్యాఖ్యలు

తిరుమలలో రాజకీయ విమర్శలు

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు రూల్స్ వర్తించవా?. తిరుమల వెంకన్న సన్నిధిలో రాజకీయ విమర్శలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయనే విషయం ఆమెకు తెలియదా?. అది కూడా దేవుడి సన్నిధికి అత్యంత దగ్గరగా మీడియాతో మాట్లాడుతూ ఆమె వాడిన భాష చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. అటు వైసీపీ నేతలు, ఇటు టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో..పరుష పదజాలంతో విమర్శలు చేసుకుంటున్నారు. అది బయట అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ కోట్లాది మంది కొలిచే వెంకటేశ్వరస్వామి దేవాలయం ముందు నిలబడి రోజా మాట్లాడిన భాష మాత్రం అందరినీ అవాక్కు అయ్యేలా చేస్తోంది. ఆదివారం ఉదయం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం రోజా చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...‘తిని కూర్చుని ఒళ్లు కొవ్వొక్కి ఈ రోజు ఏ మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితికి లోకేష్ వెళ్లటం దురదృష్టకరం.

గతంలో తన తండ్రి పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తను కూడా అడ్డదారిలో ఎమ్మెల్సీ అయి మంత్రి అయి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో ఉండి ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి..దొంగల్లా పారిపోయి హైదరాబాద్ లో కూర్చుని వాళ్లు బతికుంటే చాలు...వాళ్ళు సేఫ్ గా ఉంటే చాలు ఎవడు ఎక్కడ చచ్చినా చాలు అన్నట్లు ఉన్నారు. తమ పార్టీలో ఉన్న అవినీతి గద్దలు ఈ రోజు సాక్ష్యాలతో దొరికి అరెస్ట్ అయితే..వారి కోసం మాత్రం పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే ప్రజలకు అర్ధం అయింది. వీళ్ళ నైజం ఏంటి. వీళ్లకు అధికారం కావాలి. అవినీతి డబ్బు కావాలి తప్ప ప్రజలు..ప్రజల మీద అభిమానం లేదు’ అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు విమర్శలు చేశారు. కరోనా కారణంగా శ్రీవారిని భౌతిక దూరం పాటిస్తూ దర్శించుకున్నానని తెలిపారు. కోవిడ్ టెస్ట్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉందన్నారు.

కరోనా చికిత్సను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ కిందకి తీసుకొచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా చికిత్సకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో మంది ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఖజానాకి 3.5 లక్షల కోట్లు అప్పు ఉంచి వెళ్ళారని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా ప్రజలను క్లిష్టమైన సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్థికంగా ఆదుకున్నారని చెప్పారు. ‘పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకొంటున్నాడు. ఆయనను మంగళగిరిలో ఎంత దారుణంగా ఓడించారో చూశాం. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్.. 151 సీట్లతో తిరుగులేని ఆధిక్యతతో నాయకుడిగా ఎదిగిన వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. దేశంలోనే బెస్ట్‌ సీఎంగా వైఎస్‌ జగన్‌ నాల్గవ స్థానంలో ఉన్నారు. ముందు నారా లోకేష్‌ రాజకీయాలపై అవగాహన తెచ్చుకోవాలంటూ’ రోజా వ్యాఖ్యానించారు.

Next Story
Share it