Telugu Gateway
Andhra Pradesh

ప్రభుత్వమే ద్రవ్య బిల్లుకు ప్రాధాన్యత ఇవ్వలేదు

ప్రభుత్వమే ద్రవ్య బిల్లుకు ప్రాధాన్యత ఇవ్వలేదు
X

శాసన మండలిలో బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత, మండలిలో ఆ పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు స్పందించారు. ప్రభుత్వమే ద్రవ్య బిల్లు తర్వాత చూద్దాం..ముందు పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులే ప్రాదాన్యం అన్నట్లు వ్యవహరించిందని తెలిపారు. తాము తొలుత ద్రవ్య బిల్లు చేపట్టాలని కోరినట్లు యనమల వెల్లడించారు. ఎమ్మెల్సీ నారా లోకేష్ పై దాడి చేయటానికి మంత్రులు వస్తుంటే అడ్డుకోకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. యనమల గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. ద్రవ్య బిల్లు సభలో ఆమోదం పొందకపోవటం ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు. అయితే 14 రోజుల తర్వాత ఇది ఆటోమేటిక్ గా ఆమోదం పొందుతుందని అన్నారు.

మంత్రులు మండలిలో రెచ్చిపోయి ఇష్టానుసారం మాట్లాడరని యనమల ఆరోపించారు. సబ్జెక్ట్ లతో సంబంధం లేని వారు కూడా వచ్చి గొడవకు కారణం అయ్యారని అన్నారు. ఎక్కడైనా సభలో ప్రతిపక్షాలు గొడవ చేస్తాయని..కానీ మండలిలో విచిత్రంగా అధికార పార్టీ గొడవ చేసిందని యనమల వ్యాఖ్యానించారు. మండలిలో సభా నాయకుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు తాను విధ్వంసం అన్న మాట వాడలేదన్నారు. సీఆర్ డీఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు సెలక్ట్ కమిటీ వద్ద ఉండగా..తిరిగి వీటిని సభలో ప్రవేశపెట్టడం సరికాదన్నారు.

Next Story
Share it