Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలో ‘ఆ ఇద్దరు మంత్రులు’ ఎవరు?

వైసీపీలో ‘ఆ ఇద్దరు మంత్రులు’ ఎవరు?
X

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు గెలవటం కేవలం లాంఛనమే. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో నాలుగూ అధికార వైసీపీకే దక్కనున్నాయి. టీడీపీకి అధికారికంగా ఉన్నది 23 మంది ఎమ్మెల్యేలు. అందులో కొంత మంది జంపింగ్ జపాంగ్ లూ ఉన్నారు. మరి విప్ కు అనుగుణంగా ఐదవ అభ్యర్ధిగా బరిలో నిలిచిన వర్ల రామయ్యకు వీరు ఓటు వేస్తారా..లేదా వేచిచూడాల్సిందే. ఇది అలా ఉంటే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలు కాస్త అటు ఇటుగా తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరి ఖాళీ కానున్న ఈ మంత్రి పోస్టుల్లో కొత్తగా ఆ ‘ఇద్దరు మంత్రులు’ ఎవరు కాబోతున్నారు?. అసలు సీఎం జగన్ ఇప్పటికిప్పుడు ఆ రెండు ఖాళీలను భర్తీ చేస్తారా?. లేక మరో ఏడాది తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణ సమయంలోనే వీటిని కూడా భర్తీ చేస్తారా?. ప్రస్తుతానికి ఈ అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి మోపిదేవితో పోలిస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ వద్ద అత్యంత కీలకమైన రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలు ఉన్నాయి.

మోపిదేవి మాత్రం పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్ శాఖలు మాత్రమే చూస్తున్నారు. అయితే అత్యంత కీలకమైన రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను కూడా వేరే మంత్రులకు అప్పగించే అవకాశం కూడా లేకపోలేదని ఓ నాయకుడు తెలిపారు. గతంలో మంత్రి మోపిదేవి దగ్గర ఉన్న మార్కెటింగ్ శాఖను తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే సీఎం జగన్ శాఖల ‘సర్దుబాటు’కే ప్రాధాన్యత ఇస్తారా? లేక ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేస్తారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. వైసీపీ నుంచి రాజ్యసభకు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తోపాటు మోపిదేవి వెంకటరమణ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు అయిన పరిమళ్ నత్వానీ, అయోధ్యరామిరెడ్డి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో గతంలో ఎన్నడూలేని రీతిలో సీఎం జగన్ తాను మంత్రి పదవులను రెండున్నర సంవత్సరాలు కొంత మందికి..మరో రెండున్నర సంవత్సరాలు మరికొంత మందికి కేటాయిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it