Telugu Gateway
Andhra Pradesh

జగన్ సర్కారుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

జగన్ సర్కారుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
X

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం నాడు మీడయాతో మాట్లాడుతూ ఇసుక దగ్గర నుంచి లిక్కర్, ఆవ భూముల వ్యవహారాల్లో అక్రమాలను ప్రస్తావించారు. ఏపీకి సరిహద్దుల్లో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంతో పోల్చినా ఏపీ కొనుగోలు చేసే చీప్ లిక్కర్ ధర చాలా ఎక్కువ ఉందని..కేసుకు ఇంత అని కమిషన్ తీసుకోకపోతే ఇంత ధర సాధ్యంకాదని స్పష్టం చేశారు. లేకపోతే ఏపీ ప్రభుత్వం అసమర్ధ ప్రభుత్వం అని అనుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. వాటాలు తీసుకుంటుంటే అవినీతి ప్రభుత్వం. లేకపోతే చేతకాని ప్రభుత్వం అని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే మద్యం కొనుగోలు చేసి..ప్రభుత్వమే అమ్ముతుంది అని తెలిపారు. అదే చంద్రబాబు జమానాలో ప్రభుత్వం కొనుగోలు చేస్తే ప్రైవేట్ వాళ్లు అమ్మేవారు అని..ఇప్పుడు అలా కాదన్నారు. ఇసుక ఉన్న గోదావరి జిల్లాల్లో కూడా ఇసుక దొరక్కపోవటం ఏంటి అని ఉండవల్లి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరు ఇదంతా చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతోంది. ఇసుక లేకపోవటం వల్ల నిర్మాణాలు ఆగిపోవటమే కాదు..కార్మికులకు ఉపాధి కూడా పోతోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఇసుక అక్రమాల్లో సీఎం జగన్ కు సంబంధం ఉందని తాను అనుకోవటేంలేదన్నారు.

ఎందుకంటే ఆయన అవినీతి రహిత పాలన ఇస్తానని బహిరంగంగా చెప్పారన్నారు. అయితే మరి ఇసుక వ్యవహారాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆయన చేయి దాటిపోయిందా? అని ఉండవల్లి ప్రశ్నించారు. రాజమండ్రి లో ఆవ భూముల వ్యవహారంపై సీఎంకు లేఖ రాశా. గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా నన్ను పట్టించుకోదు. ఎకరం 43 లక్షలు చెల్లింపులు చేశారు. అంత రేటు ఉంటుందని నేను అనుకోవటం లేదు.. సబ్ కలెక్టర్ ఓ ప్రకటన చేశారు. ఇదే రేటుకు ఎక్కడ భూములు ఇచ్చినా తీసుకోవటానికి రెడీ అన్నారు. ఆర్ధిక మంత్రి కూడా మూడు శాతం మాత్రమే ఎక్కువ చెల్లించాం అది కూడా ఒకే చోట భూమి దొరికిందనే ఉద్దేశంతోనే అని తెలిపారన్నారు. ఏ రూలు ప్రకారం చూసుకన్నా అంత ధర ఇవ్వటం కుదరదు. 43 లక్షలు ఎలా అరైవ్ అయ్యారు అని ఆర్టీఐ కింద దరఖాస్తు చేశాను. ఇది చాలా పెద్ద కేసు. ప్రమాణ స్వీకారం చేసిన రోజున అవినీతి ఒప్పుకోను అన్నారు. అవినీతి జరిగితే పట్టుకోవాలి. లేకపోతే అసమర్ధత అవుతుంది. శాటిలైట్ సిటీలో కట్టినవే ఇంకా అక్యుపై కాలేదు. పదిహేను ఏళ్ళ క్రితం కట్టాం. ఏమైందో అందరూ చూస్తున్నారు. 30 శాతం కూడా అక్యుపై కాలేదు. వాంబే ఇళ్ళు కూడా అంతే ఉన్నాయి. ఆవ భూములు అంటే నీళ్లు ఎక్కువగా వచ్చేవి అని తెలిపారు. పలు అంశాల విషయంలో జగన్ సర్కారు తీరును ఉండవల్లి తప్పుపట్టారు.కరోనా నివారణలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అధికారంలో ఉన్న వారికి ప్రజలు కన్పించాలి కానీ..ప్రత్యర్ధులు..పగ కాదన్నారు. ఏమి చేసినా చూస్తూ ఊరుకోవటానికి అక్కడ ఉన్నది ఎల్వీ సుబ్రమణ్యం కాదని..నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏ బీ వెంకటేశ్వరరావులు అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ప్రజలకు 80500 కోట్ల రూపాయలు పంచుతామని చెబుతున్నారు..అంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్తారని ప్రశ్నించారు.

Next Story
Share it