యాక్షన్..స్టార్ట్...కెమెరా
టాలీవుడ్ లో షూటింగ్ లకు లైన్ క్లియర్ అయింది. ఒక్క సినిమాలే కాదు...టీవీ షూటింగ్ లకూ తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని అన్నారు. వాస్తవానికి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇచ్చారు. థియేటర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున సినిమా హాళ్లను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సినిమా, టివి షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్ల తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదాను రూపొందించారు. దీనికి అనుగుణంగానే తాజా ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో పెట్టుకుని షూటింగ్ లకు అనుమతి మంజూరు చేసిన సీఎం కెసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ లకు ధన్యవాదాలు తెలిపారు.