Telugu Gateway
Politics

ప్రధాని మోడీకి సీఎం కెసీఆర్ లేఖ

ప్రధాని మోడీకి సీఎం కెసీఆర్ లేఖ
X

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు-2020 ముసాయిదాపై పలు అభ్యంతరాలు లేవనెత్తుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈ ప్రతిపాదిత బిల్లు వల్ల ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేకపోగా..విద్యుత్ సంస్థలపై పెనుభారం పడుతుందని తెలిపారు. అంతే కాకుండా ముసాయిదా బిల్లులోని అంశాలు సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత బిల్లుపై కేంద్రం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. దీంతో సీఎం కెసీఆర్ తన అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ బిల్లు రాష్ట్రాలకు చెందిన పలు అధికారాలు, హక్కులను హరించి వేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ కమిషన్ నియామకాన్ని కేంద్రం సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసి చేయటం అనేది సమాఖ్య స్పూర్తికి విరుద్ధం అని కెసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రాల ఆమోదంతోనే జాతీయ రెన్యువబుల్ ఎనర్జీ విధానాన్ని ఖరారు చేయాలని కోరారు. ఫ్రీగా ఓపెన్ యాక్సెస్ సౌకర్యం కల్పించటం అనేది డిస్కంల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఒక మెగావాట్ కంటే ఎక్కువ సామర్ధ్యం గల వారంతా సాంకేతిక సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ఓపెన్ యాక్సెస్ కే వెళతారని పేర్కొన్నారు. ఇది కూడా డిస్కమ్ లపై ప్రభావం చూపించే అంశమేనన్నారు. ప్రతిపాదిత ముసాయిదా బిల్లులో అనేక అంశాలు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతీసేవిగా ఉన్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులో సవరణలను ఉపసంహరించుకోవాల్సిందిగా విద్యుత్ శాఖను ఆదేశించాలని ప్రధానిని కోరారు.

Next Story
Share it