Telugu Gateway
Cinema

‘వైజాగ్’ భూముల చుట్టూ టాలీవుడ్ ప్రముఖుల సమావేశం

‘వైజాగ్’ భూముల చుట్టూ టాలీవుడ్ ప్రముఖుల సమావేశం
X

స్టూడియోలు...ఇళ్ళకు స్థలాలిస్తామంటూ సీఎం జగన్ ఆఫర్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీలో ‘భూముల’ వ్యవహారమే కీలకంగా మారినట్లు కన్పిస్తోంది. ఏపీ మంత్రి పేర్ని నాని స్వయంగా ఈ విషయం వెల్లడించారు కూడా. విశాఖపట్నంలో టాలీవుడ్ ప్రముఖులు స్టూడియోలు కట్టి..అక్కడే నివాసం ఏర్పరుచుకుంటే వారికి ఇళ్ళ స్థలాలకు కూడా భూములు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారని పేర్ని నాని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో థియేటర్లకు సంబంధించిన విద్యుత్ బిల్లుల కనీస ఛార్జీలు ఎత్తేయాలన్న టాలీవుడ్ ప్రముఖుల వినతికి సీఎం అంగీకరించారని..ఈ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోసారి సినీ పెద్దలతో చర్చలు ఉంటాయని, ధియేటర్లు తెరిచేందుకు ఇంకా అనుమతి లేదని, ..కేంద్రంనుంచి అనుమతులు రాగానే తాము కూడా అనుమతిస్తామని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ కు ఎటువంటి కష్టం వచ్చినా తాను ఉన్నానని సిఎం జగన్ వారికి భరోసా ఇచ్చారని పేర్ని నాని వెల్లడించారు. ఫ్లెక్సీ ఫేర్స్ గురించి ప్రముఖంగా టాలీవుడ్ ప్రముఖులు ప్రస్తావించారు. ఇది నిర్మాతలు, హీరోలకు మాత్రమే లాభం కలిగించే అంశం అని..దీని వల్ల థియేటర్ల యాజమానులకు పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపారు.

సీఎం జగన్ పాత నంది అవార్డులను మర్చిపోమని చెప్పటం సరికాదని ఓ పరిశ్రమ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే నంది అవార్డుల ప్రదానం చేద్దామని సీఎం జగన్ సమావేశంలో ప్రస్తావించినట్లు టాలీవుడ్ ప్రముఖులు తెలిపారు. అయినా అసలు కరోనాతో అంతా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో అసలు పరిశ్రమ ప్రతినిధులు ఈ అంశం ప్రస్తావించటమే సరికాదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విచిత్రం ఏమిటంటే గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి కానీ..పోసాని కృష్ణమురళీ కానీ ఈ సమావేశంలో పాల్గొనలేదు. ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా ఈ కీలక సమావేశానికి దూరమే. ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసే బ్యానర్లు మైత్రి మూవీస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి సంస్థల నుంచి నిర్మాతలు లేరు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లాభనష్టాల గురించి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో అనుభవం ఉన్న స్రవంతి రవి కిషోర్ లాంటి వారు లేరని, ప్రముఖ హీరో బాలకృష్ణ వ్యాఖ్యనించినట్లు ఇదేదో భూముల వ్యవహారం అన్న చందంగా ఉందని పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు.

Next Story
Share it