Telugu Gateway
Telangana

పరీక్షలు లేకుండానే పాస్..తెలంగాణ టెన్త్ విద్యార్ధులకు రిలీఫ్

పరీక్షలు లేకుండానే పాస్..తెలంగాణ టెన్త్ విద్యార్ధులకు రిలీఫ్
X

ఓ వైపు కరోనా భయం. మరో వైపు పరీక్షల టెన్షన్. దీంతో తెలంగాణలోని లక్షలాది మంది పదవ తరగతి విద్యార్ధులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పరీక్షలు లేకుండా పదవ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్ లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లుండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. పదవ తరగతి పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరగణలోకి తీసుకుని పదవ తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డిగ్రీ, పిజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story
Share it