Telugu Gateway
Telangana

ఆందోళనకరంగా తెలంగాణ కరోనా పాజిటివిటి రేటు

ఆందోళనకరంగా తెలంగాణ కరోనా పాజిటివిటి రేటు
X

దేశంలోనే ఢిల్లీ తర్వాత రెండవ స్థానం

కేంద్రం ఆందోళన...టెస్ట్ లు పెంచాలని రాష్ట్రానికి హితవు

కరోనా కేసుల సంఖ్యపరంగా చూస్తే తెలంగాణ దేశంలో చాలా సేఫ్ జోన్ లో ఉన్నట్లు కన్పిస్తుంది. కానీ కరోనా పాజిటివిటి రేటు చూస్తే మాత్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. ఇది ఆందోళనకర పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. అసలు పాజిటివిటి రేటు అంటే ఏమిటి అంటే...చేసిన టెస్టుల్లో వెల్లడైన పాజిటివ్ కేసులనే ఈ రేటుగా పరిగణిస్తారు. దేశంలోనే అత్యంత తక్కువ టెస్ట్ లు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలుస్తోంది. దేశంలో కరోనా పాజిటివిటి రేటులో ఢిల్లీ ప్రధమ స్థానంలో ఉండగా..తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. మే 26-జూన్ 1 మధ్య కాలంలో జరిగిన టెస్ట్ ల్లో కూడా తెలంగాణ అత్యధిక తక్కువ టెస్ట్ లు చేసిన రాష్ట్రంగా ఉంది. దీనిపై కేంద్రం తీవ్ర ఆందోళనతో ఉందని ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. కేంద్రం మే26-జూన్ 1 మధ్య డేటాను విశ్లేషించగా తెలంగాణ పాజిటివిటి రేటు 20.2 శాతంగా ఉన్నట్లు తేల్చారు. ఢిల్లీ తర్వాత స్థానం తెలంగాణదే. ఢిల్లీలో పాజిటివిటి రేటు 25.7 శాతం గా నమోదు అయింది.

ఈ కాలంలో ఢిల్లీ లో 37 వేల టెస్ట్ లు చేయగా, 9600 కేసులు పాజిటివ్ గా వచ్చాయి. ఇఫ్పటివరకూ ఢిల్లీలో జరిగిన కరోనా టెస్ట్ లు 2.23 లక్షలు. అదే తెలంగాణ విషయానికి వస్తే అదే వారంలో కేవలం 4300 టెస్ట్ లు మాత్రమే చేసిందని ఈ కథనంలో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఉన్న పాజిటివిటి రేటు..తక్కువ టెస్ట్ ల అంశాన్ని కేంద్రం పదే పదే రాష్ట్రం దృష్టికి తీసుకెళ్లిందని తెలిపారు. తెలంగాణలో కొత్తగా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున పెరగటానికి..వైరస్ విస్తృతి అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత ఇదే తరహా హెచ్చరికను పశ్చిమ బెంగాల్ కు కూడా చేశారు. తెలంగాణ రాజధాని నగరం అయిన హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. మే 22 నాటికి దేశంలోని కరోనా పీడిత టాప్ 25 జిల్లాల్లో 8.3 శాతం పాజిటివిటి రేటుతో ఆ జాబితాలో హైదరాబాద్ కూడా నిలిచింది. మహారాష్ట్ర గత వారంలో అత్యధికంగా అంటే ఏకంగా 93 వేల టెస్ట్ లు చేయగా, అక్కడ పాజిటివిటి రేటు మాత్రం 19.08 శాతంగానే ఉంది.

తమిళనాడులో 91600 టెస్ట్ లు చేయగా, అక్కడ పాజిటివిటి రేటు 10.3 శాతం గా ఉంది. గుజరాత్ కూడా తక్కువ తొలుత తక్కువ టెస్ట్ లు చేసినా..ఇప్పుడు సంఖ్యను పెంచిందని తెలిపారు. గత వారంలో గుజరాత్ 29600 టెస్ట్ లు చేయగా, పాజిటివిటి రేటు మాత్రం 11.8 శాతంగా ఉంది. తెలంగాణలో కరోనా పరీక్షల అంశం ఆందోళనకరమని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో కరోనా పరీక్షలు సాగుతున్న అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్ని విమర్శలు వస్తున్నా తెలంగాణ సర్కారు మాత్రం కరోనా టెస్ట్ ల విషయంలో మాత్రం తాను అనుకున్నట్లే ముందుకెళుతోంది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరోనా నియంత్రణ ప్రభుత్వం వల్ల కాదని..ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

Next Story
Share it