Telugu Gateway
Andhra Pradesh

సరస్వతి పవర్ కు ‘సర్కారు రక్షణ గోడలు’

సరస్వతి పవర్ కు  ‘సర్కారు రక్షణ గోడలు’
X

మొన్న శాశ్వత నీళ్ళ కేటాయింపు జీవో

తాజాగా మైనింగ్ లీజు 50 ఏళ్ళకు పెంచుతూ ఆదేశాలు

ఓ కంపెనీకి సర్కారు ఇంతగా ‘రక్షణ గోడలు’ కల్పించటం ఉంటుందా?. సహజంగా అయితే నో అనే చెప్పొచ్చు. అదే సర్కారు పెద్దల అండదండలు ఉంటే మాత్రం అది చాలా ఈజీ. సరస్వతి పవర్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్కడలేని ప్రేమ చూపిస్తోంది. ఇటీవలే సర్కారు ఈ కంపెనీకి శాశ్వత ప్రాతిపదికన నీళ్ళ కేటాయింపు చేసింది. సహజంగా ఏ పరిశ్రమకు అయినా నిర్దేశిత కాలానికి కేటాయింపులు చేస్తూ పోతారు. తర్వాత అవసరాన్ని బట్టి దాన్ని పొడిగిస్తారు. తొలుత సరస్వతి పవర్ కు కూడా ఏదేళ్ళకే నీటి కేటాయింపులు చేశారు. కానీ కంపెనీ లాభదాయకత, పెట్టుబడులు..దీర్ఘకాలిక వ్యూహాల అమలుకు ఐదేళ్ళ కాలానికే నీటి కేటాయింపులు చేయటం సరికాదని..దీర్ఘకాలిక కేటాయింపులు చేయాలని సరస్వతి పవర్ డైరక్టర్ ఓ లేఖ రాశారు. అంతే సర్కారు ఏకంగా శాశ్వత ప్రాతిపదికన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు నీటి కేటాయింపులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

గుంటూరు జిల్లాలోని మాచవరం మండలంలోని చిన్నాయపాలెం, వేమవరం గ్రామాల్లో నెలకొల్పనున్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు కృష్ణా నది నుంచి 0.0689 టీఎంసీ (2.19 క్యూసెక్కులు) ల నీరు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఇదే కంపెనీకి చెందిన 613 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాల లీజును ఏకంగా 50 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2009 సంవత్సరంలో ఈ లీజు మంజూరు కాగా..ఇప్పుడు దీని కాల పరిమితిని 2059 వరకూ పొడిగించారు. వాస్తవానికి సున్నపురాయి లీజు నిక్షేపాలను నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో తెలుగుదేశం హయాంలో రద్దు చేయగా..కంపెనీ యాజమాన్యం కోర్టుకెళ్ళి మళ్ళీ పునరుద్ధరణ ఆదేశాలు పొందింది.

కోర్టు ఆదేశాల మేరకు 2019 డిసెంబర్ 12న ఈ లీజును పునరుద్దరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ లీజు గడువును పెంచుతూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు వెలువరించారు. అయితే ఈ లీజు గడువును పొడిగించమని యాజమాన్యం కోరిందా? లేక గనుల శాఖ అధికారులు తమంతట తామే గడువు పెంచారా అన్న వివరాలు మాత్రం జీవోలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ కంపెనీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆగమేఘాల మీద ఫైళ్ళు కదలటంతోపాటు..భవిష్యత్ లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ‘రక్షణ గోడలు’ కడుతున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇలా అన్ని అనుమతులతో కంపెనీ నుంచి తప్పుకోవటం కూడా సులభం అవుతుందని..దీర్ఘ కాలిక నీటి కేటాయింపులు, ఖనిజ నిక్షేపాల కేటాయింపులు ఉండటం కంపెనీ ‘విలువ’ను పెంచుతుందని ఆయన తెలిపారు.

Next Story
Share it