Telugu Gateway
Andhra Pradesh

షోకాజ్ కు రిప్లయ్ లో పార్టీకే ప్రశ్నలు వేసిన రఘురామకృష్ణంరాజు

షోకాజ్ కు రిప్లయ్ లో పార్టీకే ప్రశ్నలు వేసిన రఘురామకృష్ణంరాజు
X

విజయసాయిరెడ్డికి ఆ హోదా ఎవరిచ్చారు?

ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉంటారా?

అసలు పార్టీలో క్రమశిక్షణా సంఘం ఉందా?

మినిట్స్ వివరాలు ఇవ్వండి

అప్పుడు సమాధానం చెబుతా

కొత్త వివాదం రాజేసిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు అందిన షోకాజ్ నోటీసుపై స్పందించారు. ఆయన అందులో అసలు సమాధానం కంటే పార్టీకే పలు ప్రశ్నలు సంధించారు. ఈ సమాధానంలో కూడా చాలా వివాదస్పద అంశాలను లేవనెత్తారు. దీంతో రఘురామకృష్ణంరాజు పార్టీతో తేగేదాకా లాగటానికే నిర్ణయించుకున్నట్లు స్పష్టం అయింది. అసలు తనకు నోటీసు జారీ చేసిన పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అంటూ లేఖను ప్రారంభించారు. అంతే కాదు సబ్జెక్ట్ లో కూడా సమాధానం, షోకాజ్ నోటీసుకు స్పందన కాదు అని పేర్కొన్నారు. తాను జూన్ 23న అందుకున్న షోకాజ్ నోటీసుకు సంబంధించి తన ఆందోళనలు ప్రస్తావిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అసలు తమ పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే లెటర్ హెడ్ తో పంపటంతోనే దీనికి అసలు చట్టబద్దత లేదని రఘురామకృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు మిమ్మల్ని మీరు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎలా ప్రకటించుకుంటారు. మనది నమోదు అయిన రాష్ట్ర స్థాయి పార్టీ కదా ? ప్రశ్నించారు.

మీరు నాకు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో షోకాజ్ నోటీసు పంపారు.. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన పార్టీ రాజ్యాంగం ప్రకారం మీకు ఆ హోదా ఇఛ్చిన అథారిటీపైనే నాకు సందేహం ఉందని పేర్కొన్నారు. తాను కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈ కమిటీకి గుర్తింపు ఉందా?. బై లాస్ ప్రకారం దీనికి ఎవరు ఛైర్మన్?. షోకాజ్ నోటీసు జారీ చేసే ముందు పద్దతిని ఫాలో అయ్యారా వంటి ప్రశ్నలు అడగదలచుకున్నట్లు వెల్లడించారు. మీరు అన్ని నిబంధనలు పాటించినట్లు అయితే ఆ క్రమశిక్షణ కమిటీ సమావేశం మినిట్స్.ఇతర వివరాలు అందజేయాలన్నారు. పార్టీలో క్రమశిక్షణా సంఘం ఒకటి ఉందని..అది నిబందనలు పాటించిందని తేలితే తాను ఖచ్చితంగా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తానని తెలిపారు. లేదంటే ఇది అనధికారిక లేఖగానే భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పార్టీకి హాని చేయవద్దని..ఇతరుల కంటే మీరే పార్టీకి ఎక్కువ నష్టం చేస్తున్నారంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి తన లేఖ లో ప్రస్తావించారు.

Next Story
Share it