Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలో రఘురామకృష్ణంరాజు రగడ

వైసీపీలో రఘురామకృష్ణంరాజు రగడ
X

పదవులన్నీ ఒకే సామాజికవర్గానికే

బతిమాలితేనే వైసీపీలో చేరా

వైసీపీకి ఆ ఎంపీ ఇప్పుడు ఓ కొరకరాని కొయ్యగా మారారు. బహిరంగంగా పార్టీపై..అధిష్టానంపై నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. విమర్శలక స్పందించి పార్టీ అధిష్టానం సస్పెండ్ చేస్తే ఆయన ఎంచక్కా బిజెపిలోకి వెళతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగని వదిలేస్తే నిత్యం వైసీపీ ఎంపీ హోదాలో ఇలాగే మాట్లాడుతూ ఉంటే అది పార్టీకి నష్టం. మరి ఇప్పుడు చేయాల్సిన పనేంటి?. ఇదే వైసీపీ నేతల్లో ఇఫ్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి అధిష్టానం వేటు వేస్తుందో లేక అలా వదిలేసి ఊరుకుంటుందో వేచిచూడాల్సిందే. సోమవారం నాడు మరోసారి ఎంపీ రఘరామకృష్ణంరాజు పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తాను వైసీపీలో చేరాలని అనుకోలేదని.. ఆ పార్టీ నేతలు బతిమిలాడడం వల్లే వైసీపీలో చేరానని ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జగన్ పలు మార్లు ఫోన్ చేసి వైసీపీలో చేరాల్సిందిగా రిక్వెస్ట్ చేశారని తెలిపారు. తాను కాకుండా నర్సాపురంలో ఇంకెవరు పోటీ చేసినా ఓడిపోయేవారని రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్ దయతోనే రఘురామ కృష్ణం రాజు ఎంపీ అయ్యారని.. పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ అయ్యారని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన వ్యాఖ్యలతో ప్రసాదరాజుకు త్వరలోనే మంత్రిపదవి వస్తుందని.. ఆయనతో అలా ఎవరు మాట్లాడించారో తనకు తెలుసని అన్నారు. అందరిలాగా ప్రజల మీదపడి డబ్బులు కలెక్ట్ చేయడం తన పద్ధతి కాదన్న రఘురామకృష్ణంరాజు.. అటువంటి సొమ్ముతో ఫోటోలు దిగడానికి వెళ్ళలేదని చెప్పుకొచ్చారు. జగన్‌తో ప్రత్యేకంగా మాట్లాడదామనుకున్నా.. టైమ్ ఇవ్వలేదని ఆయన చెప్పారు.వైసీపీలో పదవులు అన్నీ ఒకే సామాజికవర్గానికే దక్కాయన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. భూములు కొని ఇళ్ళ పట్టాలు పంచుతున్న స్కీమ్ లో కొంది మంది భారీ ఎత్తున దోచుకుంటున్నారని ఆరోపించారు.

Next Story
Share it