Telugu Gateway
Andhra Pradesh

కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
X

కాపు రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారు లెక్కల గోల్ మాల్ తో అన్ని పథకాలు..అందరికీ ఇచ్చే వాటి లెక్కలను కూడా కలిపి కాపులకు ఏదో చేశామని గొప్పగా చెప్పుకుంటోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రచారంలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు రిజర్వేషన్ల అంశాన్ని మర్చిపోయారని వ్యాఖ్యానించారు. అసలు కాపులకు ఇచ్చింది ఎంత అనే విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే సర్కారు ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కు ఏటా రూ. 1000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించగా ప్రస్తుత పాలకులు ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారు.

మరి వారు ఇచ్చిందెంత? వీరు ఇచ్చిందెంత?.. అడిగిన వారికి కాకి లెక్కలు చెబుతున్నారు. ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి కాపుల కోసం వివిధ పథకాల ద్వారా గత 13 నెలల కాలంగా 23 లక్షల మంది కాపుల కోసం రూ. 4770 కోట్లను ఖర్చు చేశామని చెబుతున్నారన్నారు. కాపు నేస్తం పథకానికి అర్హులుగా కేవలం 2.35 లక్షలు మందిని మాత్రమే గుర్తించడంలో పలు సందేహాలు కలుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం కులాల మధ్య విద్వేషాలు పెరగడానికి ఆస్కారం కల్పిస్తోంది. ఎక్కువ నిధులు ఒకే కులానికి దక్కుతున్నాయని చెప్పడం శ్రేయస్కరం కాదన్నారు.

Next Story
Share it