Telugu Gateway
Andhra Pradesh

‘ఐప్యాక్’ ప్యాకప్ చెప్పాక పార్టీ కార్యకలాపాలేవీ?

‘ఐప్యాక్’ ప్యాకప్ చెప్పాక పార్టీ కార్యకలాపాలేవీ?
X

పదమూడు నెలల్లో పార్టీ మీటింగ్ పెట్టని సీఎం జగన్!

ప్రాంతీయ పార్టీలు ఏవైనా అంతే. అధికారం అంతా అధ్యక్షుల చుట్టూనే తిరుగుతుంటంది. అధినేత మాటకు తిరుగుతుండదు. దాన్ని ప్రశ్నించే వారు ఉండరు. ప్రశ్నిస్తే వాళ్లు ఉండరు. ఇందులో పెద్దగా ఏ పార్టీకి మినహాయింపులు లేవు. అయినా సరే కొన్ని పార్టీలు ఏడాదిలో ఎన్నో కొన్ని కార్యక్రమాలు, సమావేశాలు పెడుతుంటాయి. పార్టీని ‘యాక్టివ్’గా ఉంచుతాయి. పార్టీ యాక్టివ్ గా ఉంటేనే కదా..ఎవరైనా ప్రభుత్వంలోకి వచ్చేది. కానీ గత ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని అందుకున్న తర్వాత వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్క పార్టీ కార్యక్రమం చేపట్టలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 13 నెలలుగా పార్టీ అంతా స్తబ్దుగానే ఉందని..పలు జిల్లాల్లో విభేదాలు కూడా తీవ్ర స్థాయికి చేరున్నాయని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అదే సమయంలో నేతల మధ్య అనైక్యతలు కూడా పెరిగిపోతున్నాయని వైసీపీ నేతలే చెబుతున్నారు.

గత ఏడాది కాలంలో ఒక్కసారి కూడా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం కానీ..పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ వంటివి కూడా ఏమీ జరగలేదని చెబుతున్నారు. పార్టీ సమస్యలు కూడా ఏమైనా ఉంటే ఆయా జిల్లాలకు చెందిన నేతలు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకో లేకపోతే విజయసాయిరెడ్డి దగ్గరికో తీసుకెళుతున్నారు. నేరుగా పార్టీ అంశాలపై నేతలెవరూ కూడా జగన్ తో మాట్లాడే పరిస్థితిలేదని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. జిల్లాకు చెందిన నేతలు చెప్పిన విషయాలను అయినా ఆయా నేతలు యతాతధంగా అధినేతకు చెబుతున్నారో లేదో తెలుసుకునే వెసులుబాటు కూడా ఉండదని..ఇది అధినేతకు, పార్టీ నాయకుల మధ్య ‘గ్యాప్’ పెంచటానికి కూడా కారణం అవుతుందని చెబుతున్నారు.

ఎవరైనా అధికారంలో ఉండాలంటే పార్టీ పటిష్టంగా ఉండటం అవసరం. గత ఎన్నికల ముందు వరకూ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి సెట్ చేసే వరకూ వైసీపీకి క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ అంటూ లేకుండా పోయింది. అయితే ఎన్నికల్లో గెలుపు అనంతరం పార్టీపరంగా కాంట్రాక్ట్ అయిపోవటంతో ఐప్యాక్ కూడా ‘ప్యాకప్’ చెప్పేసిందని చెబుతున్నారు. ఇప్పుడు అదీ లేదు..పార్టీ గురించి పట్టించుకునే వారు ఎవరూ లేరనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. కాకపోతే మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్రట్రెండు సార్లు పార్టీకి చెందిన అనుబంధ విభాగాల వారితో సమావేశం జరిపారు తప్ప.. ఇతర కార్యక్రమాలేమీ లేవు. కాకపోతే ఆపరేషన్ ఆకర్ష్ వంటి పనుల విషయంలో మాత్రం ఏ జిల్లాకు చెందిన మంత్రులు ఆ జిల్లా వ్యవహారాలు చూసుకుంటున్నారు.

వీరు మాత్రం నేరుగా పార్టీ అధినేత, సీఎం జగన్ కు టచ్ లో ఉండి అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. రెండేళ్లకు ఒకసారి కార్యవర్గ సమావేశం పెట్టి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవటం (ఎంపిక), సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అసలు క్రమశిక్షణా కమిటీ ఉందా?. ఉంటే ఎవరు సభ్యులు..ఈ వివరాలు ఈసీకి పంపారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించటం కూడా పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన చెబుతున్నట్లు చాలా మంది నేతలకు పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ ఎవరు..సభ్యులు ఎవరు అన్నది కూడా తెలియదు అని ఓ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it