Telugu Gateway
Andhra Pradesh

లోకేష్ ఇక్కడ తగ్గారు..కానీ అక్కడ పెరగటం లేదు!

లోకేష్ ఇక్కడ తగ్గారు..కానీ అక్కడ పెరగటం లేదు!
X

నారా లోకేష్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎమ్మెల్సీ. ఆయన తగ్గాల్సిన చోట తగ్గాడు. అంత వరకూ ఓకే. కానీ పెరగాల్సిన చోట మాత్రం పెరగటం లేదా?. అంటే ఔననే అంటున్నాయి పార్టీ వర్గాలు. అసలు ఈ తగ్గటం ఏంటి?.పెరగటం ఏంటి అంటారా?. ఈ మధ్యే నారా లోకేష్ 20 కేజీలు బరువు తగ్గిన విషయం తెలిసిందే. దీనికి ఆయనకు అభినందనల వెల్లువ కూడా వచ్చింది. కానీ నారా లోకేష్ ఇక్కడ ఎంత బరువు తగ్గినా కూడా తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆయన ‘వెయిట్’ పెరగటం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి కూడా పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం కూడా విమర్శలు ఎన్ని ఉన్నా చంద్రబాబునాయుడిని ఆమోదించినంతగా పార్టీ నేతలు ఎవరూ లోకేష్ ను ఆమోదించే పరిస్థితి లేదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. దీనికి ప్రధాన కారణం కూడా లోకేష్ వ్యవహారశైలే అన్న విమర్శలు ఉన్నాయి. భవిష్యత్ లీడర్ గా ఎదగాలి అని కోరుకునే లోకేష్ పార్టీ నేతలను ఓన్ చేసుకుని మాట్లాడే పరిస్థితి లేదని..అందుకే నేతలు ఎవరూ కూడా లోకేష్ ను కూడా ఓన్ చేసుకునేందుకు ఆసక్తి చూపటంలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాగూ భవిష్యత్ నేత లోకేషే అనే కారణంగా కొంత మంది ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారని..అలా కాకుండా పార్టీలో..పలు జిల్లాల్లో కీలక నేతలు గా ఉన్న వారు ఎవరూ కూడా లోకేష్ తో పార్టీ విషయాలు..ఇతర అంశాలు చర్చించటానికి ఆసక్తి చూపటంలేదని ఓ సీనియర్ నేత తెలిపారు.

ఈ అంశాలు అన్నీ అర్ధం అయిన తర్వాతే చంద్రబాబు లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వటాన్ని జాప్యం చేస్తున్నారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఇప్పటికిప్పుడు ఈ కారణం చూపి కూడా కొంత మంది నేతలు, ఎమ్మెల్యేలు కూడా జంప్ అయ్యే అవకాశం లేకపోలేదనే అంచనాలు ఉన్నాయి. మరో వైపు అధికార వైసీపీ కూడా లోకేష్ ను ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ వస్తోంది. అందుకే చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే లోకేష్ మాత్రం తాను సొంతంగా దూకుడు పెంచాలనే యోచనలో ఉన్నారు. అందులో భాగంగానే ఆయన జగన్ ఏడాది పాలనపై ఓ పుస్తకం విడుదల చేశారు. ఆ సమావేశంలోనే కరోనా తగ్గాక ప్రజల్లో పర్యటిస్తాననే సంకేతాలు ఇఛ్చారు. మరి ఈ పర్యటనలకు నేతల నుంచి స్పందన ఎలా వస్తుంది... ఈ లోగా ఆయన ఏ మేరకు పార్టీ నేతల మద్దతు ఏ మేరకు కూడగట్టుకుంటారు అన్నది కీలకంగా మారింది. వైసీపీ తర్వాత దాదాపు 40 శాతం ఓటు బ్యాంకుతో ఏపీలో బలంగా ఉన్న పార్టీ టీడీపీనే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రకరకాల కారణాలతో చంద్రబాబుకు లభించినంత ఆమోదం పార్టీలో లోకేష్ కు దక్కటం లేదనే అభిప్రాయం చాలా మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it