Telugu Gateway
Telangana

పాజిటివ్ పేషంట్లు ఇంట్లో చికిత్సకు సహకరించాలి

పాజిటివ్ పేషంట్లు ఇంట్లో చికిత్సకు సహకరించాలి
X

ఇక జిల్లా స్థాయి కేంద్రాల్లో కరోనా చికిత్స!

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగితే ప్రభుత్వం, వైద్యుల మీద ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. ఆయన ఆదివారం నాడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి ఇక జిల్లా స్థాయి కేంద్రాల్లోనే వైద్య చికిత్స అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రా‍ల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ తెలంగాణలో ఎక్కడ కరోనా పాజిటివ్ కేసు తేలినా చికిత్స కోసం హైదరాబాద్ లోనే చికిత్స అందించే వారు. ప్రజలు జీవనోపాధి కోల్పోకూడదని మాత్రమే లాక్‌డౌన్‌ని ఎత్తి వేయడం జరిగిందని, ప్రజలు అవసరం లేకున్నా బయటికి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మంత్రి సూచించారు. హోమ్ క్వారంటైన్లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రజల్లో ఉన్న భయం వారిని హాస్పిటల్ నుంచి బయటకి రానివ్వడం లేదని పేర్కొన్నారు.

పాజిటివ్ పేషంట్ ఇంటి పక్కన ఉంటే తమకూ వైరస్ సోకుతుందేమో అన్న భయం ప్రజల్లో ఉండటంతో హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ‘కోవిడ్‌ బాధితుల సంఖ్య పెరిగితే ప్రభుత్వం, వైద్యుల మీది ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబందనల మేరకు తక్కువ లక్షణాలు ఉన్న, లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ పేషంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రజలు, సమాజం సహకరించాలి. లాక్‌డౌన్ సడలించడం వల్ల ప్రజలు ఎక్కువ మంది బయటకి రావడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగింది. వయసు మీద పడినవారికి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కరోనా సోకకుండా ఉండే జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నా. మరణాలు తగ్గించడానికి కృషి చేస్తున్నాం.’ అని ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story
Share it