Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ ‘పెద్ద గొంతు’ అచ్చెన్నాయుడు అరెస్ట్

టీడీపీ ‘పెద్ద గొంతు’ అచ్చెన్నాయుడు అరెస్ట్
X

ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలపై అదుపులోకి

ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చెన్నాయుడు వివిధ కొనుగోళ్ళకు సంబంధించి అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు శుక్రవారం నాడు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకోవటం రాజకీయంగా కీలక పరిణామంగా చెప్పొచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి తర్వాత అసలు అసెంబ్లీ టీడీపీ ఎలా తట్టుకుని నిలబడుతుందా అని అందరూ అనుకున్న సమయంలో టీడీపీ తరపున గట్టిగా వాయిస్ విన్పించటంలో అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారు.

అధికార పార్టీకి 151 మంది సభ్యుల బలం ఉన్నా కూడా ..అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరి వంటి నేతలే అధికార పార్టీ దూకుడును విజయవంతంగా ఎదుర్కొన్నారు. టీడీపీ పాలనలో ఎన్నో అక్రమాలు..అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చినా అధికార పార్టీ ఎదురుదాడి చేసినా కూడా తొణకకుండా నిలబడిన వ్యక్తి మాత్రం అచ్చెన్నాయుడే. ఈ తరుణంలో ఆయన అరెస్ట్ తెలుగుదేశం పార్టీకి మాత్రం షాకింగ్ వంటి పరిణామమే. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు కన్పిస్తోంది.

అసలు కేసు సంగతి ఏంటి?

ఈఎస్ ఐ కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసులో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీ హయాంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలోనే కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంత్రి చొరవతోనే డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈఎస్‌ఐ స్కాంకు పాల్పడిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలకు సదరు డైరక్టర్లు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్లు చెల్లించారు. 2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంటే , అందులో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వాస్తవ ధరగా ప్రకటించి మిగతా నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు ,ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టు విచారణలో తేల్చారు. వాస్తవానికి ఒక్కో బయోమెట్రిక్ మిషన్ ధర రూ.16,000 అయితే ఏకంగా రూ. 70 వేల చొప్పున నకిలీ ఇండెంట్లు సృషించి అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు.

Next Story
Share it