Telugu Gateway
Latest News

యాడ్స్ రావటం లేదు..పేపర్ చదవటం లేదు

యాడ్స్ రావటం లేదు..పేపర్ చదవటం లేదు
X

లే ఆఫ్స్..నిర్భంద సెలవులు

‘క్లయింట్లు యాడ్స్ ఇవ్వటం లేదు. పాఠకులు పేపర్ చదవటం లేదు. దీంతో యాడ్స్ ఆదాయంతోపాటు పత్రికల సర్కులేషన్ కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సంస్థను రక్షించేందుకే చర్యలు చేపట్టాం. అందులో భాగంగానే జిల్లాల పేజీలు తీసేసి..ప్రధాన ఎడిషన్ లో కూడా పేజీలు తగ్గించాం. దీంతో ఉద్యోగుల పనిభారం తగ్గటంతోపాటు..వారి బాధ్యతలు కూడా తగ్గాయి. దీంతో పలు విభాగాల్లో చాలా మంది మిగులు సిబ్బంది కన్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రొడక్షన్ అండ్ ప్రింటింగ్ విభాగంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ ఉంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుందని రెండు నెలలు వేచిచూసినా ఇది ఏ మాత్రం తగ్గకపోగా మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. సమీప భవిష్యత్ లో వైరస్ తగ్గుముఖం పట్టే సూచనలు కూడా కన్పించటం లేదు. ఈ పరిస్థితులను మదింపు చేసిన తర్వాత యాజమాన్యం లేఆఫ్ కు నిర్ణయం తీసుకుంది’అని ఈనాడు యాజమాన్యం ప్రకటించింది. విజయనగరం జిల్లా యూనిట్ కు సంబంధించిన లే ఆఫ్ నోటీసు ఒకటి వాట్సప్ గ్రూపుల్లో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. యాజమాన్య నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నం అయిందని పేర్కొన్నారు. అయితే పరిస్థితులు మెరుగుపడితే మాత్రం లేఆఫ్ ను ఎత్తేస్తామని తెలిపారు.

అదే సమయంలో నిబంధనల ప్రకారం లే ఆఫ్ నష్టపరిహారం మాత్రం చెల్లిస్తామని తెలిపారు. ఇది ఒక యూనిట్ పరిస్థితి అయితే హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో ఉన్న ఉన్న ఉద్యోగులకు నిర్భంద సెలవులు అమలు చేయనున్నారు. అయితే వీరికి మాత్రం ఖచ్చితంగా 15 రోజుల డ్యూటీ ఉంటుంది. మిగిలిన 15 రోజుల్లో ఎక్కువ భాగం వాళ్లంతట వాళ్ళే సెలవు పెట్టాలి. అంటే ఆ మేరకు ఉద్యోగుల వేతనాల్లో కోత పడనుంది అన్న మాట. ఈ కొత్త నిబంధనలు జూన్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. మే నెలకు మాత్రం సోమవారం నాడే పూర్తి వేతనం అందజేశారు. జూన్ నుంచి అన్ని విభాగల ఉద్యోగాల వేతనాల్లో భారీ కోత పడనుంది. ఇప్పటికే ఎవరు ఎన్ని రోజులు సెలవు పెట్టాలో కూడా యాజమాన్యం ఆయా విభాగాల ప్రతినిధులకు చెప్పేసింది. ఈ పరిణామం ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది.

Next Story
Share it