Telugu Gateway
Andhra Pradesh

ప్రభుత్వం చేసిన తప్పులకు జనం డబ్బులా?

ప్రభుత్వం చేసిన తప్పులకు జనం డబ్బులా?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రంగుల వ్యవహారంలో ఏపీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఏ రాష్ట్రంలోనూ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేసిన చరిత్ర లేదు. ఆ దురాలోచనే ఏ పార్టీ, ఏ నాయకుడు చేయలేదు. అన్నివర్గాల ప్రజలు హాజరయ్యే ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసే దుస్సంప్రదాయానికి ఎవరూ తెగించలేదు. అన్నివర్గాలకు న్యాయం చేసే తటస్థ వేదికలుగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయ భవనాలకు పార్టీ రంగులేయడం అనైతికం. అందరిదీ ఒకదారి అయితే వైసిపిది మరోదారి, అదే ‘‘అడ్డదారి-మాయదారి’’. రంగులపై డబ్బులు వృధా..అడ్వకేట్లకు ఫీజులు వృధా..ఇప్పుడు తొలగించడానికి మరోసారి డబ్బులు వృధా..? ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు..? రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదనలకు ఐదు కోట్ల రూపాయల ఫీజులు..ఇప్పుడీ రంగులపై వాదనలకు ఇంకెంత దుర్వినియోగం చేశారో..?

ఇలా ఫీజులకు, రంగులకు, కూల్చివేతలకు వేలకోట్లు వృధాకేనా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగింది? తప్పుచేసి, ఆ తప్పును దిద్దుకోకుండా, తప్పు మీద తప్పులు, ఇన్ని తప్పులా చేసేది..? మీరు చేసిన తప్పులకు ప్రజలు మూల్యం చెల్లించాలా..? మీ తప్పుడు పనులకు రాష్ట్రం నష్ట పోవాలా..? మీ మూర్ఖత్వానికి జనం జరిమానా చెల్లించాలా..? ఇది సరైంది కాదు. రంగులు వేసినందుకు, వాటిని తొలగించడానికి అయ్యే ఖర్చును వైసిపి నుంచే వసూళ్లు చేయాలి. గతంలో దీనిపై వాదనల సందర్భంగా కోర్టులు కూడా అదే చెప్పాయి. వృధా చేసిన ప్రజాధనాన్ని వైసిపి నుంచి, వాళ్ల తప్పులకు తందాన అనే అధికారుల నుంచి రాబట్టాలి. చేసిన తప్పుకు మూల్యం వైసిపినే చెల్లించాలి.’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Next Story
Share it