Telugu Gateway
Telangana

తెలంగాణ గవర్నర్ తీరుపై కెసీఆర్ గుర్రు!?

తెలంగాణ గవర్నర్ తీరుపై కెసీఆర్ గుర్రు!?
X

సొంత ప్రభుత్వంపై విమర్శలు సరికాదు:సీఎంవో

తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్. ఇటీవల నిమ్స్ లో కరోనా వైరస్ బారిన పడ్డ డాక్టర్లను పరామర్శించారు. ధైర్యం చెప్పి వచ్చారు. దేశ సరిహద్దుల్లో మరణించిన సంతోష్ బాబు పార్ధివ దేహం హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో కూడా గవర్నర్ తమిళ్ సై హాజరై ఆయనకు సెల్యూట్ చేశారు. గత కొంత కాలంగా తెలంగాణ గవర్నర్ తమిళ్ సై చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. నిమ్స్ సందర్శన సమయంలో ఆమె కరోనా నియంత్రణకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా టెస్ట్ ల సంఖ్య చాలా తక్కువగా ఉందని..వాటిని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతే కాదు...అత్యంత కీలక విభాగాలైన వైద్యం, విద్య వంటి అంశాలపై గవర్నర్ తమిళ్ సై తరచూ సమీక్షలు నిర్వహించటం సీఎం కెసీఆర్ కు ఏ మాత్రం నచ్చటంలేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో పలు అంశాలను ప్రస్తావించారు. తమిళ్ సై ఓ దశలో గాంధీ ఆస్పత్రిని కూడా సందర్శించటానికి రెడీ అయిపోయారు. కానీ డాక్లర్ల సలహా మేరకు ఆగిపోయారని తెలిపారు.

కరోనా నియంత్రణ అంశంపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా మారాయని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సమీక్షలు నిర్వహించటంపై సీఎంవో అసంతృప్తితో ఉంది. ఆస్పత్రుల సందర్శన, డాక్టర్లకు భరోసా ఇవ్వటం తప్పు కాకపోయినా ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా మాట్లాడటం సరికాదని సీఎంవో అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నిర్వహించిన కరోనా టెస్ట్ లపై గవర్నర్ నివేదిక కోరగా...ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. దీంతో గవర్నర్ సీసీఎంబీ డైరక్టర్ రాకేష్ మిశ్రాతోపాటు నిపుణులతో మాట్లాడి కోవిడ్ 19 టెస్ట్ ల గురించిన వివరాలు తెలుసుకున్నారు. గవర్నర్ తన సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదని..ఆమె పాత్ర కేవలం సలహాల మేరకు మాత్రమే పరిమితం అని ఓ సీఎంవో అధికారి తెలిపారు. ఆమె ఏ శాఖ అధికారులో అయినా మాట్లాడాలనుకుంటే ముందు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ..ఇది సంప్రదాయం అని పేర్కొన్నారు.. అయితే ప్రస్తుతం ఈ సంప్రదాయాన్ని గవర్నర్ తమళ్ సై ఉల్లంఘిస్తున్నారనేది సీఎంవో అధికారుల అభిప్రాయం.

గత నెల రోజుల వ్యవధిలో ఛాన్స్ లర్ హోదాలో వివిధ యూనివర్శిటీల వైస్ చాన్సలర్లతో ఆమె చర్చలు జరిపారని..పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేశారన్నారు. కొద్ది నెలల క్రితం తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ ఒకరు గవర్నర్ ఆదేశాల మేరకు ఆమెను కలసి ఉన్నత విద్యకు సంబంధించి ఓ రోడ్ మ్యాప్ ను అందజేశారు. ఇది ఏ మాత్రం నచ్చని ప్రభుత్వం ఆయన్ను అక్కడ నుంచి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో ఉన్న కాలేజీకి పంపింది. గవర్నర్ నియామానికి ముందు ఆమె తమిళనాడు బిజెపి చీఫ్ గా వ్యవహరించారన్న సంగతి తెలిసిందే.

తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమిళ్ సై గత కొన్ని నెలల్లో ఆమె 20 సార్లకు పైగా ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి నేతలకు అపాయింట్ మెంట్ ఇఛ్చిందని సీఎంవో వర్గాలు పేర్కొన్నాయి . అంతే కాదు ఆమె జనతా దర్భార్ కూడా నిర్వహిస్తానని ప్రకటించారు. కానీ కారణలేంటో కానీ జనతా దర్భార్ మాత్రం మొదలుకాలేదు. తెలంగాణలో ప్రతిపక్షాలు మాత్రం సీఎం కెసీఆర్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా తమ అపాయింట్ మెంట్ ఇవ్వటంలేదని ఆరోపిస్తున్నాయి. కానీ గవర్నర్ మాత్రం అడిగిన వెంటనే పార్టీలకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వానికి ఇరకాటంగా మారిందని చెబుతున్నారు. గవర్నర్ తమిళ్ సై గత కొంత కాలంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణ సర్కారు పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Next Story
Share it