Telugu Gateway
Andhra Pradesh

జగన్ సాధించిన ఘనతలు ఇవే

జగన్ సాధించిన ఘనతలు ఇవే
X

ప్రజలపై 50 వేల కోట్లు భారం ..చేసిన అప్పులు 87 వేల కోట్లు

ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

కరోనా ఉపశమన చర్యల్లో వైసీపీ సర్కారు ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో దాడులు..దౌర్జన్యాలతో భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో వైసీపీ ఏడాదిలో అవినీతి, అరాచకాలు పేట్రేగిపోతున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు గురువారం రాష్ట్ర ప్రజలకు సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపుతో రాష్ట్రానికి తీవ్రనష్టం కలిగిందని తెలిపారు. టీడీపీ హయాం కన్నా వైసీపీ హయాంలో ఆదాయం అధికంగా ఉందని... అయినా అభివృద్ది మాత్రం లేదని విమర్శించారు. సంక్షేమాన్ని కుదించారని అన్నారు. వైసీపీ దుర్మార్గాలతో రాష్ట్రానికి కీడు, ప్రజలకు చేటు కలుగుతుందని... వాటిని తెలియజేసేందుకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఏడాది పాలనలోనే జగన్ ప్రజలపై 50 వేల కోట్ల రూపాయల భారం మోపారని.. 87 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు.

ఏపీలో విద్యుత్ బిల్లులు, మద్యం ధరలు, ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెంచారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం 1.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను వెళ్ళగొట్టడంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. ఈ సమస్యలు అన్నీ వదిలేసి రాజకీయ కక్ష సాధింపులు..వేధింపులే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రత్యర్ధులపై ప్రతీకారమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ గనుల యాజమానులపై రెండు వేల కోట్ల రూపాయల జరిమానాలు విధించారని తెలిపారు. ఏడాదిగా రైతుల సమస్యలు పరిష్కరించలేదని, అప్పుల పాలైన రైతులను ఆదుకునే చర్యలు కూడా తీసుకోలేదని విమర్శించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల ఆర్ధిక మూలాలను దెబ్బతీసే పనే టార్గెట్ గా పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. తాము చేపట్టిన పలు సంక్షేమ పథకాలను మధ్యలోనే నిలిపివేశారని తెలిపారు.

Next Story
Share it