Telugu Gateway
Andhra Pradesh

కేసులు..దాడులపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

కేసులు..దాడులపై గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు
X

‘నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు మాజీ మంత్రులపై కేసులు. వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం నేతలపై అక్రమంగా కేసులు పెడుతోంది. దాడులకు పాల్పడుతోంది. టీడీపీకి చెందిన 33 మంది ప్రజా ప్రతినిధులపై కూడా కేసులు పెట్టారు.’ ఇవీ టీడీపీ గవర్నర్ కు చేసిన ఫిర్యాదులోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గురువారం నాడు గవర్నర్ బిశ్వభూషన్ హరిందన్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ కు చంద్రబాబు ఏకంగా 14 పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. వైసీపీ సర్కారు రాజ్యాంగ వ్యవస్థల విచ్చిన్నం చేస్తుందని ఫిర్యాదు చేశారు. దళితులు, బీసీలపై వైసీపీ దాడులు చేస్తోందని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు.

వైసీపీ నేతలు వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అప్రజాస్వామికంగా తొలగించారని, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లను అసభ్య పదజాలంతో దూషించారని గవర్నర్ హరిచందన్‌కు లేఖ ద్వారా చంద్రబాబు ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలు పరిరక్షణలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం చెందారని పేర్కొన్నారు. ఏడాది కాలంలో ఇసుక, భూసేకరణ, మద్యం‌లో అక్రమాలకు పాల్పడ్డారని గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

Next Story
Share it