Telugu Gateway
Andhra Pradesh

బడ్జెట్ సమావేశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

బడ్జెట్ సమావేశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి బడ్జెట్ సమావేశాలా..లేక రాజధాని తరలింపు సమావేశాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు గురువారం నాడు ఆన్ లైన్ టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఎంతో గొప్పగా పోరాడారని..ఇది చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. కొంత మంది నేతలు వైసీపీ ప్రలోభాలకు లొంగి చరిత్ర హీనులుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్సీలు మంత్రుల దౌర్జన్యాలను తట్టుకుని బలంగా నిలబడ్డారని అన్నారు. ఇదే పోరాట స్పూర్తిని భవిష్యత్ లోనూ కొనసాగించాలని కోరారు. చాలా మంది ఎమ్మెల్సీలు అనారోగ్య సమస్యలు, వయస్సును కూడా లెక్కచేయకుండా ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదిరించారని ప్రశసించారు.

బుధవారం నాడు మండలిలో హై ఓల్టేజ్ హంగామా సాగిన విషయం తెలిసిందే. శాసనసభలో ఆమోదం పొందిన ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులను కూడా మండలిలో ఆమోదింపచేసుకునేందుకు అధికార పార్టీ విశ్వప్రయత్నం చేసింది. అయితే ప్రతిపక్ష టీడీపీ తొలి నుంచి ద్రవ్య వినిమయ బిల్లు ముందు పెట్టాలని పదే పదే ఒత్తిడి చేసినా..ప్రభుత్వం మాత్రం ముందు రాజధాని వికేంద్రీకరణతోపాటు సీఆర్ డీఏ రద్దు వంటి బిల్లులే ముందు చేపట్టాలని పట్టుపట్టింది. నిబంధనల ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లును చివరలోనే టేకప్ చేస్తారని ప్రభుత్వం వాదించింది. చివరకు ఏ బిల్లులు ఆమోదించకుండానే శాసన మండలి నిరవధికంగా వాయిదా పడటంతో రాజకీయంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it