Telugu Gateway
Andhra Pradesh

అచ్చెన్నాయుడిది కిడ్నాప్ అంటున్న చంద్రబాబు

అచ్చెన్నాయుడిది కిడ్నాప్ అంటున్న చంద్రబాబు
X

మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడిది కిడ్నాప్ అని..దీనికి సీఎం జగన్, హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అచ్చెన్నాయుడి కిడ్నాప్ బలహీనవర్గాలపై దాడి అని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడి కిడ్నాప్‌కు జగన్‌ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడి ఆచూకీని డీజీపీ వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘అసెంబ్లీకి మరో 4 రోజు ముందు అచ్చెన్నాయుడు కిడ్నాప్‌ జగన్‌ కుట్రే. రాష్ట్రవ్యాప్తంగా బడుగు బహీనవర్గాలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి. ప్రభుత్వం బడుగు బహీన వర్గాలకు చేస్తున్న మోసం, అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారు.

ఇది సహించలేని జగన్‌ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి 100 మంది పోలీసు ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్‌ చేశారు. ఆయనను మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశారు. నేను ఫోన్‌ చేసినా అచ్చెన్నాయుడు ఫోన్‌ అందుబాటులోకి రాలేదు. ఇది జగన్‌ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదు... పిచ్చి పరాకాష్టకు చేరినట్లుగా ఉన్నది. ప్రజల్లో జగన్‌ మోసాలకు, అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న అసంతృప్తి ఫ్రస్ట్రేషన్‌గా మారి ఈ రకమైన ఉన్మాద చర్యలకు ఒడికడుతున్నారు. ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు... ముందస్తు నోటీసు ఇవ్వలేదు.. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it