Telugu Gateway
Andhra Pradesh

ఏపీ లిక్కర్ ..మైనింగ్ విధానాలను సీబీఐ పరిశీలిస్తోంది

ఏపీ లిక్కర్ ..మైనింగ్ విధానాలను సీబీఐ పరిశీలిస్తోంది
X

ఏ ఆధారాలతో సీబీసీఐడి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఫుటేజ్ అడిగారు

ఏ ఆధారంతో పోలీసులు పార్క్ హయత్ ను అడిగారు

పార్క్ హయత్ ఎలా ఇచ్చింది..అంతర్జాతీయ కోర్టులో కేసు వేస్తా

ఏపీ ప్రజలు చేసిన ‘ఒక్క ఛాన్స్’ ప్రయోగం విఫలమైంది

చంద్రబాబు తప్పుల వల్లే వాళ్లకు అవకాశం

సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపీ సుజనా చౌదరి ఏపీ సర్కారుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అమలు అవుతున్న లిక్కర్ వ్యవహారం, మైనింగ్ విధానాలను కూడా సీబీఐ పరిశీలిస్తోందని అన్నారు. ఈ అంశంపై ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్రానికి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వైసీపీ నేతలు ఏదో హంగామా తనకూ బిజెపి అధిష్టానానికి మధ్య దూరం పెంచలేరని అన్నారు. అసలు వైసీపికి కేంద్రంలో అంత సీన్ కూడా లేదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు వచ్చిన సమాచారంతోనే సీఎం జగన్ కు ఇఛ్చిన అపాయింట్ మెంట్ రద్దు చేశారని తెలిపారు. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లతో జరిగిన భేటీ గురించి ఓ ఛానల్ తో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులోని ముఖ్యాంశాలు. ‘ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి రాంగ్ డైరక్షన్ లో వెళుతోంది. మంచి సలహాలు తీసుకుని ప్రభుత్వాన్ని నడిపితే బాగుంటుంది.

ప్రభుత్వాన్ని నడిపించే పద్దతి మాత్రం ఇది కాదు. ఈ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయటం వల్ల ఎవరికి బెనిఫిట్ అయింది. అక్కడ చేసిన నేరం ఏంటి. చేసిన తప్పేంటి?. సోషల్ లైజనింగ్ చేయకూడదా?. గత 40 రోజులుగా అక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నా. నా దగ్గర ఇద్దరు పోలీసు గార్డులు ఉంటారు. వాళ్లను అడిగినా చెబుతారు కదా?. ఇందులో రహస్యాలు ఏమి ఉన్నాయి. ఎవరైనా మానవత్వం చూపిస్తూ ముందుకు పోవాలే కానీ..ఒక్క సామాజిక వర్గంతో ఏమీ కాదు. ఫుటేజ్ రిలీజ్ విషయాన్ని లీగల్ గా నేను కూడా రిఫర్ చేస్తున్నా. ప్రైవసీకి భంగం కల్పించారు. పార్క్ హయత్ పబ్లిక్ ప్లేస్. అక్కడ ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే, క్రిమినల్ యాక్టివిటి జరుగుతుంటే ఎవరైనా చేయవచ్చు. అది ఏమైనా ఉందా?. లేదు కదా?. ఏ బేసిస్ మీద సీబీసీఐడి వాళ్ళు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పార్క్ హయత్ ను ఫుటేజీ అడిగారు. ఏ బేసిస్ మీద పార్క్ హయత్ ఇచ్చింది. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కు లెటర్ రాస్తాను. అంతర్జాతీయ కోర్టులో కూడా పెడతాను. వ్యాపార సంస్థలు దెబ్బతింటాయని ఆలోచిస్తుంటే ప్రజాస్వామ్యం మొత్తం మట్టి కలసిపోతుంది. కేవలం మెజారిటీ వచ్చిందని అన్ని వ్యవస్థలు, నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

మెజారిటీ అనేది ఎంతో కాలం ఉండదు. అది గాలిబుడగ లాంటిది. నిబంధనలకు విరుద్ధంగా విజువల్స్ బయటకు వెళ్లిన అంశం బిజెపి అధిష్టానంతో పాటు ఎక్కడికి వెళ్లాలో అక్కడకు వెళుతుంది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల సంగతి ముఖ్యమంత్రి తెలుసో..లేదో?. మొదట్లో అంటే తెలియకపోవచ్చు. కానీ ఏడాది తర్వాత కూడా సీఎంకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయన అసలు సీఎంగా ఉండటానికి కూడా అర్హుడు కాదు. ఏపీలో రాష్ట్ర పోలీసులు, బ్యూరోక్రాట్ల వ్యవస్థ దారుణంగా పడిపోయింది. చాలా మంది బ్యూరోక్రాట్లు డిప్యుటేషన్ మీద వెళ్లాలనుకుంటున్నారు. నా దగ్గరికే చాలా మంది వచ్చారు. ప్రజలు చేసిన ప్రయోగం ‘ఒక్క ఛాన్స్ ’ అవకాశం అనేది పూర్తిగా విఫలమైంది. అలాగని చంద్రబాబు బ్రహ్మాండంగా చేశారని నేను చెప్పటం లేదు. వాళ్ళు తప్పులు చేయబట్టే వీళ్లకు అవకాశం వచ్చింది. టీడీపీకి 40 శాతం ఓట్లు వేశారు అంటే ప్రజలు అన్యాయం చేసినట్లు కాదు. సంవత్సరం నుంచి నా మీద అమరావతి విషయంలో కూతలు కూస్తున్నారు కదా?. ఏమి చేశారు. ఏమీ చేయలేరు. ఇప్పుడు సీబీఐకి ఇచ్చారు. చూద్దాం ఏమి తేలుస్తారో’ అంటూ సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it