Telugu Gateway
Andhra Pradesh

అచ్చెన్నాయుడి అవినీతిపై అసెంబ్లీలో చర్చకు ఓకేనా?

అచ్చెన్నాయుడి అవినీతిపై అసెంబ్లీలో చర్చకు ఓకేనా?
X

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపికి చేతనైతే అచ్చెన్నాయుడి అరెస్ట్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేయగలరా? అని ప్రశ్నించారు. బొత్స శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతసేపూ అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారే తప్ప.. అవినీతి జరగలేదని చంద్రబాబు, టీడీపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదని.. పక్కా ఆధారాలతో ఏసీబీ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిందని తెలిపారు.

తనపై చంద్రబాబు గతంలో లేనిపోని ఆరోపణలు చేశారని ఆ సమయంలో తాను సీబీఐ విచారణను స్వాగతించానని గుర్తు చేశారు. ‘‘నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నా. అయినా.. నాపై మీ పత్రికల్లో ఇష్టానుసారంగా వార్తలు రాయించలేదా. నేను కూడా వెనుకబడిన కులానికి చెందిన వాడినే. నేను బీసీ అని అప్పుడు మీకు గుర్తురాలేదా’’అని చంద్రబాబును ప్రశ్నించారు. కిడ్నాప్ అంటే ఎవరికి తెలియకుండా ఎత్తుకు పోవడం. కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు బొత్స.

Next Story
Share it