Telugu Gateway
Andhra Pradesh

బొత్స అమరావతి పర్యాటనకు కారణాలేంటి?

బొత్స అమరావతి పర్యాటనకు కారణాలేంటి?
X

ఏపీ సర్కారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరాదని నిర్ణయించుకుంది. అందుకే రెండవసారి తాజాగా అసెంబ్లీలో బిల్లు ఆమోదింపచేసుకుని..మండలిలో కూడా మరోసారి బిల్లు ప్రవేశపెట్టింది. మండలిలో దీనిపై చర్చ జరిగి ఆమోదం లభించలేదు. అయినా సరే జులై 21 నాటికి మూడు రాజధానులకు సంబంధించి ఈ బిల్లుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు. కాకపోతే కరోనా కారణంగా ఇఫ్పటికిప్పుడు రాజధానిని తరలించే మూడ్ లో సర్కారు లేదు. ఏది ఏమైనా వచ్చే విద్యా సంవత్సరం నాటికి విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని తరలివెళ్ళటం మాత్రం ఖాయం అని చెబుతున్నారు. కాకపోతే సీఎం జగన్ కాస్త ముందు వెళితే వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వరస పెట్టి అమరావతిలో ప్రాంతంలో పర్యటించచటం ఆసక్తికరంగా మారింది. బొత్స తన పర్యటన సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో, హెచ్‌ఓడీలకు సంబంధించిన టవర్స్, జడ్జిల క్వార్టర్స్‌ ను పరిశీలించారు.

అధికారులు ఈ సందర్భంగా నిర్మాణపు పనుల పురోగతిని మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి బొత్స సీఆర్డీఏ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో భేటీ అయి ఆయా నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుంది?. వ్యయం అవుతుంది తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖపట్నానికి తరలించనుండటంతో ఇక్కడ ఐఏఎస్ అధికారులు, ఇతరుల కోసం నిర్మించిన నివాస సముదాయాలను ఏమి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖపట్నానికి తరలించటానికి ముందే ఇక్కడ పెండింగ్ లో ఉన్న నిర్మాణాలు పూర్తి చేస్తారా?. రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతులకు మేలు చేసేలా నూతన అసెంబ్లీ భవనంతో పాటు ఇతర నిర్మాణాలు ఏమైనా ప్రతిపాదిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. రాజధాని తరలింపు అంశంపై ఇఫ్పటికే భూములు ఇచ్చిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ముందు ప్రకటించిన ప్రకారం అయితే కొత్త భవనాలు ఏమీ కూడా గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాల్లో చేపట్టరాదనే యోచనలో సర్కారు ఉంది. దీనికి కారణం ఇక్కడ నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని చెబుతోంది.

Next Story
Share it