Telugu Gateway
Telangana

ఉద్యోగ సంఘ నేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఉద్యోగ సంఘ నేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ ఉద్యోగ సంఘ నేతలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘ నేతలు సర్కారుకు తొత్తులుగా మారారని ఆరోపించారు. కొంతమంది వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్ అయిన వారి సర్వీసు పొడిగింపు జీఓలు జారీ చేయడం దుర్మార్గమని సంజయ్ విమర్శించారు. ఇది ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. మద్యం దుకాణం కోసం కూడా ప్రత్యేక జీఓలు జారీ చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు..ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ లెక్చరర్లు, ఎక్సైజ్ సీఐల ఉద్యోగ కాలం పొడగింపు జీఓలు జారీ చేయడమేంటని ప్రశ్నించారు. బయటకు తెలిసిన జీఓలు కొన్ని అయితే.. రహస్యంగా జారీ చేసిన జీఓలకు లెక్కేలేదని, జారీ చేయాలనుకుంటున్న జీఓలకు అంతులేదని అన్నారు.

ప్రభుత్వం చేస్తోన్న ఈ మోసంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వైద్యులకు కరోనా సోకిందని, బీజేపీ ఎంత చెప్పినా.. వైద్యులకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు పంపిణీ చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు. వైద్యులను కాపాడలేని ఈ ప్రభుత్వం ఇక సామాన్యులను ఏం కాపాడుతుందంటూ విమర్శించారు. మీకు చేతగాకపోతే చెప్పండి.. కోవిడ్ ఆస్పత్రుల్లోని వైద్యులను మేం కాపాడుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు.

Next Story
Share it