Telugu Gateway
Andhra Pradesh

తెలంగాణ అనుమతిస్తే బస్సు సర్వీసులు

తెలంగాణ అనుమతిస్తే బస్సు సర్వీసులు
X

హైదరాబాద్ నుంచి ఏపీకి బస్సులు నడిపేందుకు ఇంకా తెలంగాణ సర్కారు నుంచి అనుమతి రాలేదని..అనుమతి రాగానే అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయని ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. బస్సుల అనుమతి కోసం తెలంగాణాతోపాటు ఇతర రాష్ట్రాలకు లేఖలు రాశామని చెప్పారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను సోమవారం నుంచి ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్‌పోస్టులన్నీ లాక్ డౌన్ ముగిసేవరకూ కొనసాగుతాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారంతా ఖచ్చితంగా ‘స్పందన’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సిందేనని తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా ప్రయాణాలు నిర్వహించుకోవాలని కృష్ణబాబు సూచించారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాల (మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ) నుంచి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని కృష్ణబాబు స్పష్టం చేశారు.

Next Story
Share it