Telugu Gateway
Andhra Pradesh

ఏపీ కేబినెట్ సమావేశం ఈసారి వైజాగ్ లో!

ఏపీ కేబినెట్ సమావేశం ఈసారి  వైజాగ్ లో!
X

ఈ ఏడాది చివర్లో వైజాగ్ కు రాజధాని

వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉద్యోగులందరూ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళిక అమలుకు రంగం సిద్ధం చేశారు. అంతకు ముందు ప్రకటించినట్లుగానే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చేందుకు..ఆ ప్రాంత ప్రజలకు ఈ విషయంలో తానేమీ వెనక్కి తగ్గలేదనే సంకేతం ఇఛ్చేందుకు తదుపరి మంత్రివర్గ సమావేశాన్ని వైజాగ్ లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ కేబినెట్ సమావేశం కూడా త్వరలోనే ఈ వారాంతంలో కానీ..వచ్చే వారం ఉండే అవకాశం ఉందని సమాచారం. కరోనా సమస్య లేకపోతే ఇఫ్పటికే రాజధాని తరలింపు ప్రక్రియ ఊపందుకునేది . కానీ కరోనా కారణంగా..హైకోర్టులో రాజధాని రైతులు వేసిన పిటీషన్లు పెండింగ్ లో ఉండటం..మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ఆగిపోవటం ప్రభుత్వం అనుకున్నట్లు రాజధాని తరలింపు ప్రణాళికలకు బ్రేక్ పడినట్లు అయింది.

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంవో అధికారులు అందరూ వైజాగ్ కు వెళతారని..వచ్చే విద్యా సంవత్సరం నుంచి సచివాలయ ఉద్యోగులతోపాటు ఇతర విభాగాల ఉద్యోగుల తరలింపు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అప్పటికే అసెంబ్లీలో బిల్లుల ఆమోదంతోపాటు మిగిలిన ప్రక్రియ అంతా పూర్తవుతుందని భావిస్తున్నారు. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ చట్టసభల్లో రాజధాని వికేంద్రీకరణ బిల్లుల ఆమోద ప్రక్రియ పూర్తయ్యే వరకూ రాజధాని తరలింపు ఉండదని అఫిడవిట్ దాఖలు చేశారు. అంతే కాకుండా విద్యా సంవత్సరం మధ్యలో సచివాలయ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగుల తరలింపు సాధ్యం అయ్యే పనికాదు అందుకనే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. జగన్ రాజకీయ కోణంలోనే అమరావతిలో రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

అయితే చంద్రబాబు ప్రభుత్వం కేవలం రాజధాని నిర్మాణం కోసమే అని రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాల భూములు సేకరించింది. కానీ ఇప్పుడు జగన్ సర్కారు ఇక్కడ అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాజధాని వికేంద్రీకరణ పేరుతో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలుకు జ్యుడిషియల్ క్యాపిటిల్, అమరావతిని లెజిస్లేచర్ క్యాపిటల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతి విషయంలో జగన్ తీరు ఎలా ఉంది అంటే ఓ పది వేల మంది ఉద్యోగులు ఉన్న ఓ హెడ్ ఆఫీస్ ను తీసేసి..వెయ్యి ఉద్యోగులతో బ్రాంచ్ ఆఫీసును కొనసాగిస్తూ ఇది కూడా కంపెనీ ఆఫీసే కదా అని చెప్పిన చందంగా ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అయితే రాజధానికి భూములు ఇఛ్చిన రైతులకు సర్కారు ఏమి చెబుతుంది..వాళ్ళతో కుదిరిన ఒప్పందాలను ఎలా డీల్ చేస్తారన్నదే కీలకంగా మారనుంది.

Next Story
Share it