Telugu Gateway
Andhra Pradesh

ఏపీలోకి ‘అమూల్’ ఎంటర్..హెరిటేజ్ కు చుక్కలే!

ఏపీలోకి ‘అమూల్’ ఎంటర్..హెరిటేజ్ కు చుక్కలే!
X

‘అమూల్’ ఆ బ్రాండ్ పేరు తెలియని వారు. గుజరాత్ కేంద్రంగా నడిచే అతిపెద్ద సహకార పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ. ఇప్పుడు ఏపీలోకి అధికారిక రూట్ లో ఎంటర్ అవుతోంది. ఈ మేరకు జగన్మోహన రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు ప్రకటించింది. పశువులకు మంచి వైద్యం, సంరక్షణతోపాటు ఉత్తమ సాంకేతికత, పాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ దిశగా అడుగులు వేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని సర్కారు ప్రకటించింది. సహకార రంగం బలోపేతం, పాడి రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జులై 15లోగా ఏపీ సర్కారు అమూల్ తో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. పాల ఉత్పత్తుల రంగంలో దేశంలో అత్యుత్తమ సహకార సంస్థగా నిలిచిన అమూల్‌కు ఉన్న పేరు, సాంకేతిక పరిజ్ఞానం, విస్తృతమైన మార్కెటింగ్‌ రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికీ, రైతులకూ మేలు జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ పాడి రైతులకు మేలు జరగాలని, వారు ఉత్పత్తిచేస్తున్న పాలకు మంచి రేటు రావాలని స్పష్టంచేశారు.

ధర విషయంలో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూదనన్నారు. రైతులకు అదనపు ఆదాయాలు ఇవ్వాలి, మరోవైపు సహకార రంగం బలోపేతం కావాలన్నారు. పాడిపరిశ్రమలో అమూల్‌కున్న అనుభవం రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడాలని, పాడిపశువులకు వైద్యం, సంరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, తద్వారా రైతులకు మంచి రేటు... ఇలా అన్ని అంశాల్లోనూ పాడిపరిశ్రమరంగం పటిష్టంకావాలన్నారు. రైతుల్ని దోచుకునే పరిస్థితి ఎక్కడా ఉండకూదన్నారు. అమూల్‌తో కలిసి అడుగులు ముందుకేసేలా... తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘అమూల్’ వంటి బ్రాండ్ ఏపీలోకి ఎంటర్ అవటాన్ని ఎవరూ ఆక్షేపించలేరు. కానీ ఇది ఏపీలోనే ఎక్కువ ఫోకస్ ఉన్న హెరిటేజ్ ను మాత్రం ఖచ్చితంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై కూడా తన సొంత వ్యాపారాల కోసం సహకార డైరీని దెబ్బకొట్టారనే విమర్శలు ఉన్నాయి.

Next Story
Share it