ఏపీలోనూ షూటింగ్ లకు అనుమతి
ఏపీలోనూ సినిమాల షూటింగ్ లకు అనుమతి ఇఛ్చారని ప్రముఖ హీరో చిరంజీవి తెలిపారు. తాము సీఎం ముందు పెట్టిన అన్ని డిమాండ్లపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు మంత్రి పేర్ని నాని, నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, సురేశ్ బాబు, సి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అయితే ఇక్కడ కూడా సీఎం జగన్ షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు.
‘టాలీవుడ్ ప్రముఖలంతా ఏడాది కాలంగా సీఎం జగన్‌ను కలవాలని అనుకున్నాం.. కానీ కుదరలేదు. ఈ రోజు కలిశాం. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. థియేటర్లలో మినిమం ఫిక్స్ డ్ ఛార్జీలు ఎత్తేయాలని కోరాం. నంది వేడుకలు పెండింగ్‌లో ఉన్నాయి. 2019-20కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం. టికెట్ల ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం. పరిశీలిస్తామని సీఎం జగన్ అన్నారు. అదే జరిగితే పారదర్శకత ఉంటుంది. మాకు చాలా మేలు జరుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం ఆనందం కలిగించింది.’ అన్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖుల వినతి మేరకు తెలంగాణ సర్కారు కూడా షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా మంగళవారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.