Top
Telugu Gateway

అప్పుడు సాక్షి తప్పు రాసిందా?.ఇప్పుడు జగన్ తప్పు చేశారా?

అప్పుడు సాక్షి తప్పు రాసిందా?.ఇప్పుడు జగన్ తప్పు చేశారా?
X

రెండింట్లో ఏదో ఒకటే నిజం ఉండాలి. రెండు నిజాలు ఉండవు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టా?. లేక ఆయనకు చెందిన పత్రిక సాక్షిలో అప్పుడు వచ్చిన వార్త నిజమా?. ఏపీలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఇప్పుడు ఏపీ అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రభుత్వ రంగ సంస్థకే అప్పగించాలని వైసీపీ నేత, ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపక్షంలో ఉండగా ప్రధాని నరేంద్రమోడీకి అప్పట్లో లేఖ రాశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రతిపక్షంలో ఉన్న స్టాండ్ మార్చేసుకుని ప్రైవేట్ సంస్థ జీఎంఆర్ కు పనులు అప్పగించారు. అది కూడా చంద్రబాబునాయుడు ఎంపిక చేసిన టెండరే కావటం విశేషం. అసలు చంద్రబాబు టెండర్లు అన్నీ స్కామ్ లే అని విమర్శించిన వైసీపీ..మంత్రివర్గ ఉపసంఘం మాత్రం ఎందుకు అత్యంత వివాదస్పదమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను వదిలేసిందో సర్కారు వారికే తెలియాలి.

భోగాపురంలో భారీ స్కామ్ కు స్కెచ్ అంటూ గతంలో సాక్షి పత్రిక ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా ఏమేమి రాయితీలు ఇవ్వబోతుందో ప్రముఖంగా ప్రస్తావించింది. దీనిపై ఆర్ధిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను కూడా సవివరంగా రాసింది. కానీ ‘సాక్షి’ లేవనెత్తిన అభ్యంతరాలు అన్నీ కూడా జగన్ సీఎం అయిన తర్వాత కూడా తూచ్ అన్నారు. టెండర్ మాత్రం జీఎంఆర్ కే కట్టబెడుతూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. మరుసటి రోజే అంటే జూన్ 12న జీఎంఆర్ తో ఒప్పందం కూడా చేసుకున్నారు. మరి ఎవరిది తప్పో..ఎవరిది ఒప్పో ఎవరు చెప్పాలి?. ప్రతిపక్షంలో ఓ స్టాండ్..అధికారంలోకి వచ్చాక మరో స్టాండ్.

Next Story
Share it