Telugu Gateway
Andhra Pradesh

లక్ష కోట్లకు పైగా పెరిగిన ఏపీ జీఎస్ డీపీ

లక్ష కోట్లకు పైగా  పెరిగిన ఏపీ జీఎస్ డీపీ
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక ఆర్ధిక సర్వేను విడుదల చేశారు. దీని ప్రకారం అంతకు ముందే ఏడాదితో పోలిస్తే స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్ డీపీ) 1.10 లక్షల కోట్ల రూపాయల మేర పెరుగుదల నమోదు అయింది. ప్రస్తుత ధరల ప్రకారం 2019-20 ఆర్ధిక సంవత్సరంలో జీఎస్ డీపీ 9,72,782 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది అంతకు ముందు ఏడాది అంటే 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 8,62,957 కోట్ల రూపాయలు. దీంతో మార్చితో ముగిసిన ఏడాదికి జీఎస్ డీపీలో 12.73 శాతం పెరిగినట్లు అయింది. స్థిర ధరల ప్రకారం చూస్తే జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.16 శాతంగా నిలిచింది. ఇది జాతీయ సగటు 5 శాతం కంటే చాలా ఎక్కువ కావటం విశేషం.

స్థిర ధరల్లో జీఎస్‌డీపీ 6,72,018 కోట్ల రూపాయలుగా నిలిచింది. వ్యవసాయం రంగంలో అనుకూల వాతావరణం వల్ల ఈ విభాగంలో 18.96 శాతం మేర వృద్ధి నమోదు అయింది. వ్యవసాయ రంగంలో ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల విలువ 3,20,218 కోట్ల రూపాయలుగా ఉంది. పరిశ్రమల రంగంలో స్థిర ధరల వద్ద 5.67 శాతం వృద్ధి నమోదు కాగా, సేవా రంగంలో 9.11 శాతం వృద్ధి చోటుచేసుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయం 1.51 లక్షల నుంచి 1.69 లక్షలకు పెరుగింది. ఏపీలో అక్షరాస్యత రేటు 67.35 శాతం ఉన్నా..ఇది జాతీయ సగటు 72.98 శాతం కంటే తక్కువగా ఉంది.

Next Story
Share it