చెత్త మీది..శుద్ధి మాది

అంటోంది ఏపీ సర్కారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఈఎంసీ) ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించారు. పారిశ్రామిక సంస్థలు తమ వద్ద ఉన్న వ్యర్థాల గురించి ఆన్‌లైన్‌లో నమోదుచేసుకుంటే వాటిని తీసుకెళ్లి కాలుష్య రహితంగా ట్రీట్ చేసే ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిద్ధం చేసింది. ఏపీఈఎంసీ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన వ్యర్థాల బదలాయింపునకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీఈఎంసీని ప్రారంభించారు. పరిశ్రమల నుంచి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను ఇకపై ఏపీఈఎంసీ చేపట్టనుంది.
పర్యావరణ నియమాలు, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయనుంది. దీని కోసం దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ వేస్ట్ ఎక్స్ ఛేంజ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. వ్యర్థాల నిర్వహణలో కచ్చితమైన ట్రాకింగ్, స్క్రూటినీ, ఆడిటింగ్ ప్రక్రియలు నిర్వహించనున్నారు. కలుషిత వ్యర్థాలను సమర్థంగా నిర్వహించే ట్రీట్‌మెంట్ వ్యవస్థలేని పరిశ్రమలు ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించే సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. ఇలా పరిశ్రమలు – వ్యర్థాల సమర్థ నిర్వహణ సంస్థలను ఆన్‌లైన్ వేదికగా కలిపేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇందుకుగాను వ్యర్థాల నిర్వహణ సంస్థలకు, ఏపీఈఎంసీకి పరిశ్రమలు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా ఆన్‌లైన్ వేస్ట్ ఎక్ఛ్సేంజ్ ప్లాట్‌ఫామ్ దేశంలోనే ఇది మొదటిది అని అధికారులు తెలిపారు.